Ration Cards in Telangana: తెల్ల రేషన్‌కార్డు అనేక సంక్షేమ పథకాలకు ప్రామాణికం. తెల్ల రేషన్‌కార్డు కలిగిన వారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటాయి. రేషన్ పంపిణీ దగ్గర నుంచి సంక్షేమ పథకాల్లో సబ్సిడీ వరకూ ఈ కార్డును ప్రాతిపదికగా తీసుకుంటారు. తెలంగాణలో అమలయ్యే అన్ని పథకాలకూ రేషన్ కార్డ్ ఇంపార్టెంట్ అయ్యింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు రేవంత్ ప్రభుత్వం బంపర్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికీ.. ఉచితంగా ఆరు కేజీల చొప్పున దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే వచ్చే ఏడాది జనవరి నుంచి దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యం పంపిణీ చేసేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పీడీఎస్ ద్వారా సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు ఇప్పటికే సన్న బియ్యం సాగు, ఉత్పత్తి, ప్రొక్యూర్మెంట్, మిల్లింగ్‌పై అధికారులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ సెంటర్లకు సన్న బియ్యం అందిస్తుండగా.. రేషన్ షాపుల్లోనూ సన్న బియ్యం ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
కోట్ల మందికి లబ్ధి: ప్రస్తుతం రాష్ట్రంలో 90.23 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వారి కోసం ప్రతి నెలా 1.75 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తుండగా.. సంవత్సరానికి 21 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. ప్రస్తుతం సర్కారు తీసుకున్న నిర్ణయంతో 2.82 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. సన్నబియ్యం పంపిణీ చేసే సమయానికి కొత్త రేషన్ కార్డులు మంజూరు అయితే ఈ సంఖ్య మరింత పెరగనుంది.
అదనంగా మరికొన్ని: ఇప్పటి వరకు రేషన్ సరుకులుగా బియ్యం, చక్కెర, కొన్ని చోట్ల గోధుమలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. వీటితోపాటు మరికొన్ని సరుకులు అదనంగా ఇస్తామని సీఎం ప్రకటించారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ప్రజలకు అందించే సంక్షేమ పథకాలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. అతి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను కూడా మంజూరు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే చాలా మంది మంత్రులు ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.