Gold Shop Owner Beat Employees In Hyderabad : పొట్టకూటి కోసం షాపులో పనిచేస్తూ యజమానిని జీతం అడగడమే వారు చేసిన పాపం. నెలరోజులు కష్టపడి పనిచేసినందుకు ఫలితంగా జీతం అడిగితే కోపంతో దొంగతనం అంటగట్టి చితకబాదాడు ఒక యజమాని.
వివరాల ప్రకారం : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బంగారం షాపు యజమాని దారుణంగా ప్రవర్తించాడు. జీతం డబ్బులు అడిగినందుకు ఇద్దరు యువకులపై దొంగతనం ముద్ర వేసి విచక్షణ రహితంగా దాడి చేశారు. బంగారం షాపులో పని చేసిన ఇద్దరు యువకులకు జీతం డబ్బులు ఇవ్వలేదు. తమకు శాలరీ ఇవ్వాలని ఇవాళ వారు యజమానిని నిలదీశారు. దీంతో కోప్రోద్రిక్తుడైన ఓనర్ యువకులను దుకాణం ముందు నిలబెట్టి దొంగతనం ముద్ర వేశాడు. ఇద్దరు యువకులపై దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై అక్కడి స్థానికులు అవాక్కయ్యారు. జీతం అడిగినందుకు ఇంతలా కొట్టాలా అని ప్రశ్నించారు. యజమాని తీరుపై మండిపడ్డారు.