GHMC on Underground Tunnels : భారీవర్షాలు కురిసినప్పుడు చెన్నై, ముంబై, బెంగళూరు, విజయవాడ తరహాలో హైదరాబాద్‌లో వరద సమస్య రాకుండా జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. భారీ వర్షం పడి రోడ్లపై నిలవకుండా వరద నీరంతా ఈ టన్నెల్స్‌లోకి వెళ్తుంది. జపాన్ టెక్నాలజీ సాయంతో భూగర్భంలో టన్నెల్స్ నిర్మాణాలను చేపడుతోంది.
టన్నెల్స్ ద్వారా జపాన్‌లో వరద నియంత్రణ : ప్రపంచంలోకెల్లా జపాన్‌లో అత్యధికంగా ప్రకృతి విపత్తులు సంభివిస్తుంటాయి. ముఖ్యంగా రాజధాని టోక్యోలో వాటి ప్రభావం మరింత ఎక్కువ. దీనిపై చిన్నా, పెద్ద కలిపి ఏకంగా 100 నదులు ప్రవహిస్తాయి. మారిన వాతావరణ పరిస్థితులు, ఏటా పెరుగుతున్న వర్షపాతంతో నగరంలోని ఇళ్లను నదులు ముంచెత్తేవి. ఈ ప్రమాదం నుంచి ప్రజలను రక్షించేందుకు అక్కడి ప్రభుత్వం 18ఏళ్ల కిందట టోక్యో ఉత్తర భాగంలోని జాతీయ రహదారి కింద సొరంగాన్ని నిర్మించి, దీన్ని వరద కాలువలకు అనుసంధానం చేసింది. అప్పటినుంచి నగరాన్ని ఆ సొరంగం రక్షిస్తోంది. ఏకంగా 90శాతం వరద నష్టం తగ్గింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇటీవల జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు టోక్యో వెళ్లి టన్నెల్‌ను పరిశీలించి వచ్చారు.
హైదరాబాద్‌లో చేపట్టాల్సిన వరద నియంత్రణ చర్యలకు నిధుల కోసం గతంలో జపాన్ అంతర్జాతీయ సహకార బ్యాంకును జీహెచ్‌ఎంసీ ఆశ్రయించింది. దీంతో గతేడాది జపాన్ ప్రతినిధులు హైదరాబాద్‌కు వచ్చి నగరాన్ని పరిశీలించారు. అనంతరం వారి సూచనతో ఇటీవల జీహెచ్‌ఎంసీ ఇంజినీర్లు టోక్యో వెళ్లారు. వరద ముప్పును పక్కాగా అడ్డుకుంటున్న భారీ టన్నెల్‌ను చూశారు. ఆ స్థాయి నిర్మాణాలు హైదరాబాద్‌కు అవసరం లేదని, సాంకేతికత, ఆలోచన, వాటి స్ఫూర్తిని తీసుకుని చిన్న స్థాయిలో నిర్మాణాలు చేపట్టవచ్చని అధికారులు నిర్ణయించారు.
90శాతం తగ్గిన వరద సమస్య : జనావాసాలను వరద ముంచెత్తకుండా జపాన్ ఇంజినీర్లు నాలాలను సొరంగానికి అనుసంధానం చేశారు. వరద నీరు ఎంత ఉద్ధృతంగా వచ్చినా సొరంగంలోకి వెళ్లాక నిదానంగా ప్రవహించాల్సిందే. లోపల ఉన్న పిల్లర్లు వాటి వేగాన్ని నియంత్రిస్తాయి. ఒక్కో పిల్లరు 500 టన్నులకు పైగా బరువు ఉంటుంది. ఈ వరదంతా చివరణ స్థానికంగా ఉన్న నదిలో కలిస్తుంది. ఈ టన్నెల్ నిర్మాణానికి అప్పట్లో రూ.14,285 కోట్లు ఖర్చు అయిందని, వరద నష్టాన్ని తగ్గించడం ద్వారా గత 18 ఏళ్లలో తమకు సుమారు రూ.1.26 లక్షల కోట్లకు పైగా ఆదా అయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. పైగా ఈ సొరంగాన్ని చూసేందుకు ఏటా 50,000ల మంది పర్యాటకులు వస్తున్నట్లు పేర్కొన్నారు.
"వరదను మళ్లించడానికి రోడ్ల కింద సొరంగాలను తవ్వితే భవిష్యత్‌లో వాహనాల కోసం అండర్‌పాస్‌లు, ఇతరత్రా పనులు చేపట్టడం కష్టమవుతుందని జపాన్ ఇంజినీర్లు ముందే ఆలోచించారు. దానికి పరిష్కారంగా భూమికి 50 మీటర్ల లోతున సొరంగాన్ని నిర్మించారు. అవి కూడా నిండిపోతే భారీ మోటార్లతో నీటిని సముద్రంలోకి ఎత్తిపోసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ తరహా నిర్మాణాలను ఇటీవల హైదరాబాద్‌లోనూ చేపట్టాం. రోడ్లపై నిలిచే వరదను దారి మళ్లించేందుకు 5 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేయగల భూగర్భ జలాశయాలను పలుచోట్ల నిర్మించనున్నాం. టోక్యోలోని కట్టడాలను చూశాక మనవద్ద మరింత పెద్ద ట్యాంకులను నిర్మించవచ్చనే ఆలోచన వచ్చింది." - కోటేశ్వరరావు, చీఫ్ ఇంజినీరు, జీహెచ్‌ఎంసీ
టోక్యో ప్రాజెక్టు స్వరూపం | |
సొరంగం పొడవు | 6.3 కిలోమీటర్లు |
లోతు | భూమికి 50 మీటర్ల కింద |
వెడల్పు | 10 మీటర్లు |
ఎత్తు | 18 మీటర్లు |
ఖర్చు | రూ.14,285 కోట్లు (1.7 బిలియన్ డాలర్లు) |
పనులు పూర్తయిన ఏడాది | 2006 |
విజయవాడలో వరదల నివారణ - డ్రైనేజీ వ్యవస్థ సమూల ప్రక్షాళనే మార్గం! - AP Govt Control Floods Vijayawada