Amrapali On GHMC GIS Survey : ఆస్తి పన్ను మదింపుతోపాటు నగరవాసులకు మెరుగైన సేవలు అందించేందుకు భాగ్యనగరంలో చేపట్టిన జీఐఎస్ సర్వే వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని బల్దియా కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. జీహెచ్ఎంసీలోని 5 సర్కిళ్లలో జులై 30న మొదలుపెట్టిన ఇంటింటి సర్వే ద్వారా ఇప్పటి వరకు 130 చదరపు కిలోమీటర్లు మాత్రమే డ్రోన్ సర్వే జరిగిందని వెల్లడించారు.
వాటిని గుర్తించేందుకే : డ్రోన్ సర్వేపై ప్రజల్లో అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్న వేళ రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ స్నేహ శబరీశ్‌తో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆమ్రపాలి వివరాలను వెల్లడించారు. శాటిలైట్ మ్యాపింగ్‌కు అనుగుణంగా డ్రోన్ల ద్వారా కేవలం నగరంలోని నిర్మాణాలు, భవనాలు, రహదారులు, ఆస్తులను గుర్తించేందుకు మాత్రమే సర్వే చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం యజమానుల నుంచి బలవంతంగా ఎలాంటి ఆధారాలు సేకరించడం లేదని పేర్కొన్న ఆమ్రపాలి అనధికారిక, అధికార నిర్మాణాల ప్రస్తావన లేకుండా సర్వే చేస్తున్నట్లు వివరించారు.
ఆస్తి పన్ను పెంపు ఉండదు : డ్రోన్, ఇంటింటి సర్వే ద్వారా ఆస్తి పన్ను పెంపు ఉండదని ఆమ్రపాలి స్పష్టం చేశారు. ఆస్తి పన్ను పెంపు ప్రభుత్వం తీసుకునే నిర్ణయమని పేర్కొన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే నిర్వహించడం వల్ల జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ఆస్తులు, యుటిలిటీస్ మ్యాప్ చేయడానికి ఈ సర్వే దోహదపడుతుందన్నారు.
Amrapali On Security Zones : మొత్తం 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరిగే ఈ సర్వేలో కంటోన్మెంట్ లాంటి సెక్యురిటీ జోన్లకు సంబంధించిన సమాచారం బహిర్గతం కాదని, ప్రజల నుంచి సేకరించిన వివరాలు కూడా అత్యంత భద్రంగా ఉంచుతామని ఆమ్రపాలి తెలిపారు. నగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించామని, అందులో కమర్షియల్ గా 2.7 లక్షల గృహాలు ఉన్నట్లు తెలిపారు. సామాన్యుల నివాసాల నుంచి కాకుండా వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుంచి వాస్తవ ఆస్తి పన్ను రాబడతామని తెలిపారు.
ఒకే సర్వే పలు రకాల సేవలు : జీఐఎస్ సర్వే ద్వారా ప్రజలకు ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేటుగానూ ఎన్నో రకాల సేవలందుతాయని ఆమ్రపాలి వివరించారు. డ్రోన్ సర్వే పూర్తయ్యాక ప్రతి అంశం మ్యాపింగ్ జరుగుతుందని, తద్వారా వీధుల్లో విద్యుత్ దీపాల దగ్గరి నుంచి చెత్త సేకరణ వరకు ప్రతి అంశం జీహెచ్ఎంసీకి సమగ్ర వివరాలు అందుతాయన్నారు. ఆస్తి పన్ను మదింపులోనూ చాలా సులభతరం అవుతుందన్నారు.
ఈ మేరకు రోజూవారీ జీవితంలో తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్న ఆమ్రపాలి తాను నివాసం ఉండే కుందన్ బాగ్ లో చెత్త సేకరణ సరిగా చేయడం లేదని, ఆ విషయం ఈ సర్వే అనంతరం ఎప్పటికప్పుడు తెలిసిపోతుందన్నారు. అలాగే ఇంటింటికి ప్రత్యేకంగా డిజిటల్ డోర్ నెంబర్ ఇస్తామని, దానిపై ఉన్న క్యూఆర్ కోడ్ వల్ల ఆ ఇంటికి లేదా వీధిలో ఎలాంటి సేవలందాయనే విషయాలు క్షణాల్లో తెలిసిపోతాయన్నారు.
దేశానికే రోల్ మోడల్‌గా హైదరాబాద్ : ఈ సర్వేలో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, భవనాలు, చెరువులు, పార్కులు ఎన్ని ఉన్నాయో గుర్తిస్తామని, వాటి ప్రతి సంఖ్య కచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుందన్నారు. ఆ డేటాను హైడ్రాకు అందిస్తామని కమిషనర్ ఆమ్రపాలి వివరించారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు చిన్న చిన్న పట్టణాల్లో ఇలాంటి సర్వేలు జరిగాయని, మంచి ఫలితాలు వచ్చాయని వివరించారు. దేశంలో హైదరాబాద్ నగరాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రయోగాత్మకంగా ఈ జీఐఎస్ డ్రోన్ సర్వే చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఆరు నెలల్లో సర్వేపూర్తి : ప్రజల నుంచి సేకరించే డేటా రేల్ టేల్ సర్వర్‌లో అత్యంత భద్రంతా ఉంటుందన్నారు. మొదట్లో ఒక్కో ఇంటి వద్ద సర్వే కోసం 40 నుంచి 45 నిమిషాల సమయం పడుతుందని, అందుకోసం సేకరించే వివరాలను తగ్గించామని ఆమ్రపాలి తెలిపారు. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా డ్రోన్ సర్వే నెమ్మదిగా సాగుతుందని రెవెన్యూ విభాగం అదనపు కమిషనర్ స్నేహ శభరీష్ తెలిపారు.
నగరంలో ప్రస్తుతం 90 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని, అవసరాన్ని బట్టీ సర్వే బృందాల సంఖ్యను పెంచుతామన్నారు. మొత్తం 600 బృందాలతో రానున్న 6 నెలల్లో జీఐఎస్ సర్వేను పూర్తి చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు.
అక్రమాలకు అడ్డాగా జీహెచ్ఎంసీ - కాగ్ నివేదికలో సంచలన విషయాలు - CAG report on GHMC corruption