Ganesh Immersion in Hussain Sagar : హుస్సేన్‌సాగర్ వద్ద బొజ్జ గణపయ్య నిమజ్జనాలపై జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ ఓ నిర్ణయానికి వచ్చాయి. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి వచ్చే వినాయక విగ్రహాల సంఖ్యకు తగ్గట్లుగా అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకునే ప్రణాళికకు అధికారులు జై కొట్టారు. రద్దీ తక్కువ ఉంటే ట్యాంక్‌బండ్‌కు నిమజ్జన వేడుక నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులు గురువారం ఎన్టీఆర్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన నాలుగు క్రేన్లను తొలగించారు. ఖైరతాబాద్ నుంచి సచివాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలకు అంతరాయం కలగొద్దనే ఆ క్రేన్లను నెక్లెస్ రోడ్డుకు మళ్లించామని తెలిపారు.
మార్గదర్శకాలివే..
- వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
- వినాయక విగ్రహాలను జలాశయాల్లో కాకుండా స్థానికంగా తాత్కాలిక కొలనులు ఏర్పాటు చేసుకొని నిమజ్జనం చేయాలి. దీనివల్ల ఉత్పత్తయిన వ్యర్థాలను స్థానిక సంస్థలు 24 గంటల్లోపు తరలించాలి.
- గణేశ్ విగ్రహాల నిమజ్జనం వేళ సైన్‌బోర్డులు, అగ్నిమాపక పరికరాలు, బారికేడ్లు ఏర్పాటు చేయాలి.
- వ్యర్థాల సేకరణ కోసం ప్రతి కొలను, జలాశయం వద్ద కేంద్రాలను ఏర్పాటు చేయాలి. పూజా, ఇతర వ్యర్థాలను గణేశ్ నిమజ్జనానికి ముందే సేకరించాలి.
- వినాయక నిమజ్జన సమయంలో కాలుష్యమైన రంగులు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తాత్కాలిక కొలను వద్ద వ్యర్థ జలాలను వెంటనే ఎస్టీపీలకు తరలించి శుద్ధి చేయాలి.
విద్యుత్తు దీపాలను పరిశీలించాలి : నగరంలో గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రభుత్వం రహదారులు, భవనాల శాఖ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ లింగారెడ్డి అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మరోవైపు హుస్సేన్‌సాగర్‌లో, నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన కొలనులో పేరుకుపోయిన వ్యర్థాలను ఇప్పటికే జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలిగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు.
ఈ విధంగా హుస్సేన్‌సాగర్‌లో క్లీనింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాగర్‌లోని వ్యర్థాలను తొలగించే బాధ్యతను హెచ్‌ఎండీఏ, రోడ్లను శుభ్రం చేసే బాధ్యతను జీఎచ్ఎంసీ తీసుకుని పనులు మొదలుపెట్టాయి. ప్రకృతికి హాని కలిగించే గణేశ్ విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
హుస్సేన్‌సాగర్‌లో గణపయ్య నిమజ్జనం - హైకోర్టు కండిషన్స్ ఇవే - Hussain Sagar Ganesh Immersion
హైదరాబాద్‌లో ఈనెల 10 నుంచి గణేశ్ నిమజ్జనాలు - ఆ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు