Ganja Transport in Gas Cylinders : అంతర్రాష్ట్ర మత్తు పదార్ధాల రవాణా ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఇటీవల కాలంలో పోలీసుల నిఘా(Police Surveillance) దాడులు ఎక్కువ కావడంతో కొత్త పద్దతుల ద్వారా అక్రమార్కులు గంజాయి రాష్ట్రాల సరిహద్దులు దాటిస్తున్నారు. రకరకాల మార్గాల్లో ఇప్పటి వరకు గంజాయి తరలించిన నేరగాళ్లు ఈసారి తమ పంథా మార్చి ఏకంగా వాహనాలకు ఉపయోగించే సీఎన్‌జీ సిలిండర్లలో తరలిస్తున్నట్టు బయటపడింది.
గ్యాస్ సిలిండర్‌లో గంజాయి : రాష్ట్రాల సరిహద్దులను ఏ మాత్రం అనుమానం రాకుండా దాటించడానికి మత్తు ముఠా వేసిన ఎత్తుగడలను మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. దేశంలోనే ఈ విధంగా గంజాయి తరలిస్తూ ముఠా దొరికిపోవడం మొదటిసారి. రాష్ట్రంలో పోలీసులు మాదకద్రవ్యాలు(Drugs), గంజాయి వంటి మత్తు పదార్ధాల నిర్మాలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నారు.
పుష్ప మూవీ తరహాలో ఎర్ర చందనం తరలింపు - పోలీసులకు చిక్కిన యూపీ స్మగ్లర్ల ముఠా
జాతీయ రహదారులపై నిఘా అధికం చేయడంతో పాటు పబ్బులు, బార్లు వంటి వాటిపై ప్రత్యేక నిఘా(Special Surveillance) ఏర్పాటు చేశారు. పలువురు అక్రమార్కులను కూడా అరెస్టు చేసి భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ బులంద్‌షహర్‌కు చెందిన అరవింద్, అభిషేక్ తోమర్, ఆశిష్, ఆకాష్ సోలంకి కలిసి ముఠాగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నుంచి గంజాయి తరలించి ఆగ్రాకు తీసుకెళ్లి విక్రయించాలని భావించారు.
Police Seized Ganja in Medchal : విశాఖపట్నంలో 65 కిలోల గంజాయి కొనుగోలు చేసిన ముఠా వాహనాల సీఎన్‌జీ సిలిండర్లతో పాటు కారు సీట్ల మధ్యలో ఉంచి రవాణా చేస్తున్నారు. ముఠా ప్రయాణిస్తున్న రెండు కార్లు మేడ్చల్ జాతీయ రహదారి వద్దకు రాగానే పోలీసులు తనిఖీలు చేశారు. ముందుగా కార్ల సీట్ల వద్ద ఉన్న గంజాయి బయటపడింది.
ముఠాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, సీఎన్‌జీ సిలిండర్లలో(CNG Cylinders) గంజాయి రవాణా చేస్తున్న విషయం బయటపడింది. నిందితుల నుంచి రూ.19.5 లక్షల రూపాయల విలువైన గంజాయితో పాటు రెండు కార్లు, ఆరు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
"మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నేషనల్ హైవేపై అనుమానాస్పదంగా ఆంధ్రా నుంచి ఆగ్రాకు రెండు కార్లలో తరలిస్తున్న 65 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. దీనికి సంబంధించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. దేశంలోనే తొలిసారిగా సీఎన్‌జీ సిలిండర్లలో వింత పద్ధతిలో గంజాయి తరలిస్తున్నారు. పోలీసులకు చిక్కిన ఈ కేసులో మొత్తం 65 కేజీల గంజాయి సహా రెండు కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం."-నిఖిత పంత్, మేడ్చల్ డీసీపీ
మాదకద్రవ్యాలను నిరోధించడంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు మత్తు ముఠాల సమాచారం తెలిస్తే డయిల్ 100, సైబరాబాద్ వాట్సప్ నెంబర్ 949061744, మాదకద్రవ్యాల నిరోధక విభాగం(Anti-Narcotics Division) 7901105423 ఫోన్ నెంబర్‌కు సమాచారం అందించాలని పోలీసు అధికారులు కోరారు.
కిరాణా దుకాణంలో గంజాయి చాక్లెట్ల అమ్మకం - ఒడిశాకు చెందిన వ్యక్తి అరెస్ట్