Free Sand Distribution in Andhra Pradesh : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీని అమలు చేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలుకు శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు బుధవారం దిశానిర్దేశం చేయడంతో సంబంధిత శాఖ అధికారులు ఉచిత ఇసుక విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అగ్రనేతలు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని రూ.వేల కోట్లు దోచుకున్నారు. వైఎస్సార్సీపీ దోపిడీని, ప్రజల అవస్థలను గుర్తించిన కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా ఇసుక అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే కీలక ఎన్నికల హామీ అయిన ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.
గత ప్రభుత్వంలో గుత్తేదారులు ఉన్నవారు, రాష్ట్రంలో వివిధ నిల్వ కేంద్రాల్లో ఇసుక నిల్వచేశారు. ఇప్పుడు ఆ ఇసుకను మొదటి మూడు నెలలపాటు ఉచితంగా అందజేయనున్నారు. అలాగే బ్యారేజీలు, జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇసుక తవ్వకాలకు, నిల్వ కేంద్రాలకు తరలించేందుకు అయిన ఖర్చును మాత్రమే ప్రజల నుంచి తీసుకోనున్నారు. అందుకు అయిన ఖర్చు ఎంత అనేది ఆయా జిల్లాల్లో కలెక్టర్లు నిర్ణయిస్తారు. సెప్టెంబరు వరకు ఇదే విధంగా ఉచిత ఇసుకను అందజేయనున్నారు.
రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు : ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు సంబంధించి రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం. సీఎం వద్ద జరిగిన సమావేశం అనంతరం ఆ శాఖ సంచాలకుడు ప్రవీణ్‌కుమార్ అన్ని జిల్లాల గనులశాఖ డీడీలు(DD), ఏడీలతో(AD) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జిల్లాల్లో ఉన్న ఇసుక నిల్వ కేంద్రాలను వెంటనే పరిశీలించి, ఎంత ఇసుక ఉందో లెక్కలు వేసి నివేదిక పంపాలని కోరారు.
'ఏపీ ఇసుక ఫైల్స్' తవ్విన కొద్దీ అక్రమాలు - ఆ ఒక్క సంతకంతో రూ.800 కోట్లు - AP Sand Files
ఐదేళ్లలో కనీవినీ ఎరగని దోపిడీ : జగన్ సర్కారు హయాంలో జరిగిన ఇసుక దోపిడీ కనీవినీ ఎరుగనిదని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గత ప్రభుత్వం తొలుత టన్ను ఇసుక రూ.375, తర్వాత రూ.475 చొప్పున విక్రయించిందని గుర్తు చేశారు. ఊరూపేరులేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టి, వాటిపేరిట వైఎస్సార్సీపీ అగ్రనేతలే నేరుగా ఇసుక వ్యాపారంచేసి వేల కోట్లు రూపాయలు పోగేసుకున్నారని ఆరోపించారు. ట్రాక్టర్ ఇసుక కావాలంటే రూ.10 వేలు, లారీ లోడు కావాలంటే రూ.25-30 వేలు వెచ్చించాల్సినంతలా ధరలు పెంచేశారని మండిపడ్డారు.
"మూడు నెలల( సెప్టెంబర్) వరకు కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నాం. వర్షాకాలం కావడంతో నదుల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉండదు. ఇందుకు పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అందుకే నిల్వ కేంద్రాల్లో ఎంత ఇసుక ఉందనేది లెక్కిస్తున్నాం. ఇసుక అక్రమాల్లో భాగస్వాములైన అందరిపైనా చర్యలు తీసుకుంటాం. ప్రాథమిక పరిశీలన బట్టి జేపీ సంస్థ ప్రభుత్వానికి 700 కోట్ల రూపాయలకు పైగా చెల్లించాల్సి ఉంది. అయినాసరే గత డైరెక్టర్ ఆ సంస్థకు ఎలా నో డ్యూ సర్టిఫికెట్ ఇచ్చారు? బ్యాంక్ గ్యారంటీల విడుదలకు ఎలా ఆదేశాలు ఇచ్చారన్న అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తాం. జగన్ సర్కారు హయాంలో అసలు ఏం జరిగిందో చెప్పలేని స్థితిలో గనులశాఖ అధికారులు ఉన్నారు" -కొల్లు రవీంద్ర, గనుల శాఖ మంత్రి
ప్రభుత్వం మారినా ఆగని వైఎస్సార్సీపీ నేతల ఇసుక దందా - Sand Mafia Police Seized Vehicles
ఏపీ ప్రజలందరికీ ఉచిత ఇసుక అందజేయనున్నామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. త్వరలో దీనిని అమలు చేసేలా శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి ఒక్కరికీ, ప్రతి రోజూ ఉచిత ఇసుక అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.