Hyderabad Online Scams : ఓ యువకుడు పెట్రోల్ బంక్ వద్దకెళ్లి తనకు నగదు ఇస్తే ఆన్‌లైన్‌లో బదిలీ చేస్తానంటూ నిర్వాహకుడిని కోరాడు. 10 శాతం అదనంగా సొమ్ము వస్తుందనే ఆశతో నిర్వాహకుడు అంగీకరించాడు. మొబైల్ నంబర్‌కు బ్యాంకు సందేశం రావటంతో బ్యాంకులో నగదు పడిందనుకుని ఆ మొత్తాన్ని ఆ యువకుడికి చెల్లించాడు. కొంత సమయం తరువాత ఆన్‌లైన్‌లో నగదు నిల్వలు పరిశీలించుకొని మోసపోయినట్టు తెలుసుకున్నాడు. గుర్తుతెలియని వ్యక్తి ఒకేరోజు మూడు చోట్ల ఇదే తరహా మోసం చేసి రూ.లక్షన్నర మేర కాజేశాడు.
ఏటీఎం కేంద్రం వద్ద మధ్య వయస్కుడు తాను డెబిట్‌కార్డు మరచిపోయానంటూ ఒక మహిళ వద్ద నగదు తీసుకొని యూపీఐ ద్వారా రూ.50 వేలు ట్రాన్స్ఫర్ చేశాడు. ఇంటికెళ్లి చూసుకున్న మహిళ నగదు రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. నగరంలో మాయగాళ్లు ఇలాంటి కొత్త తరహా మోసాలకు తెగబడుతున్నారు. రకరకాల కారణాలు చెబుతూ మీరు నగదు ఇస్తే తాను యూపీఐలో చెల్లిస్తానంటూ బురిడీ కొట్టిస్తున్నారు. ప్రస్తుతమున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని వీలైనంత పెద్దమొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు.
రకరకాలుగా మోసాలు: ఈ రోజుల్లో నగదు చెల్లింపుల్లో యూపీఐ వినియోగం పెరిగింది. చేతిలో నగదు లేకపోయినా జేబుల్లో ఏటీఎం కార్డులు లేకున్నా ఫోన్‌లోనే లావాదేవీలు నిర్వహించే వెసులుబాటు వచ్చింది. ఈ అవకాశాన్ని కొంతమంది మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. రాజస్థాన్‌కు చెందిన ముఠా సభ్యులు నగరంలోని పలు దుకాణాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసి యూపీఐ ద్వారా నగదు చెల్లిస్తున్నారు. కొంత సమయానికి ఆ నగదు ఉపసంహరణ కావడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు దర్యాప్తులో అంతర్రాష్ట్ర ముఠా యూపీఐ చెల్లింపులను ఆసరా చేసుకొని రూ.4 కోట్ల విలువైన వస్తువులు కాజేసినట్టు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి 10 కేసులతో ప్రమేయం ఉన్న 13 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా ఇదే తరహాలో బ్యాంకులు, పెట్రోల్ బంకులు, షాపింగ్‌మాల్స్ వద్దకు చేరి తమకు అత్యవసరంగా డబ్బులు కావాలని తమ కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నారంటూ అవతలి వారిని మోసం చేస్తున్నారు. వారి నుంచి నగదు చేతికి అందగానే యూపీఐ స్కానర్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు.
బ్యాంకు ఖాతాలో నగదు జమైనట్టు ఫోన్‌కు సందేశం రావటంతో అమాయక ప్రజలు తేలికగా నమ్ముతున్నారు. నగదు నిల్వల్లో తేడాలున్నట్టు గుర్తించి అడిగితే ప్రస్తుతం సాంకేతిక కారణాలు కావచ్చంటూ మభ్యపెట్టి మాయమవుతున్నారు. సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్నవారు, సైబర్ నేరస్థులకు సహకరిస్తున్న ఏజెంట్లు ఈ తరహా ఘరాన మోసాలకు పాల్పడే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయం వ్యక్తంచేశారు. పరిచయం లేని వ్యక్తులతో నగదు లావాదేవీలు నిర్వహించటం కొన్నిసార్లు నష్టంతోపాటు, పోలీసు కేసుల్లో ఇరుక్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ 7 టిప్స్‌తో మీ వాట్సాప్ ఫుల్ సెక్యూర్డ్- ప్రైవసీ కూడా! - Whatsapp Security Tips