AP Former YCP MP Illegal Construction Demolished : ఏపీలోని గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ అక్రమ కట్టడాలను సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెంలో వైఎస్సార్సీపీ నేత నందిగం సురేశ్ తాను ఎంపీగా ఉన్న సమయంలో సీఆర్డీఏకు చెందిన ఎకరం స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మించారు. అయినా అప్పటి సీఆర్డీఏ అధికారులు వీటిపై కన్నెత్తి చూసే సాహసం చేయలేదు.
ఇక్కడ అర్ధరాత్రి వరకు పార్టీలు చేసుకుంటూ సెటిల్‌మెంట్ చేసేవారు. విజయవాడ నుంచి యువతను తీసుకొచ్చి గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవించేవారని ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అక్రమ నిర్మాణాలపై సీఆర్డీఏ అధికారులు దృష్టి పెట్టారు. ఉద్దండరాయినపాలెంలో సురేశ్ అక్రమంగా నిర్మించిన నివాసాలను సీఆర్డీఏ అధికారులు కూల్చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బలగాలను మోహరించారు.
రాజధానిలో పంటల సాగు చేపట్టి భారీగా లబ్ధి : ఐదు సంవత్సరాల పాలనలో వైఎస్సార్సీపీ రాజధాని అమరావతిని పూర్తిగా పట్టించుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ పార్టీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ అనుచరులు, నాయకులు చేసిన అక్రమాలు అంతా ఇంతా కాదు. రాజధాని భూముల్లో అనధికారికంగా పంటల సాగు చేపట్టి భారీగా లబ్ధి పొందారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా కొంత మంది వైఎస్సార్సీపీ నాయకుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.
ఉద్యోగుల సహాయంతో అక్రమ నిర్మాణాలు : తుళ్లూరు మండలం శాఖమూరుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జొన్నకూటి ప్రశాంత్‌తో పాటు మరికొంత మంది నాయకులు సుమారు 50 ఎకరాల సీఆర్డీఏ భూముల్లో అనధికారికంగా పంటలు సాగు చేస్తున్నారు. సీఆర్డీఏ రీజనల్ కార్యాలయం సమీపంలో ఉన్న లింగాయపాలెం, ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, ఐనవోలు, రాయపూడి, మందడం ప్రాంతాల్లో ఈ పరిస్థితి నెలకొంది. వీరిలో నందిగం సురేశ్ అనుచరులూ ఉన్నారు. సీఆర్డీఏలో గతంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి పలువురు ఉద్యోగుల సహాయంతో పంటలు సాగు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
"రాజధాని అమరావతి భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న వాటిని తొలగిస్తున్నాం. ఇంట్లోని వస్తువులు ఖాళీ చేయడానికి కొంతమంది రేపటి వరకు సమయం కాావాలని కోరారు. అందుకోసం కొన్నింటిని వదిలేశాం. ఈరోజు కొన్నింటిని తొలగించాం. రాజధాని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కనుక ఎటువంటి అక్రమాలు ఉన్నా తొలగిస్తాం. ఇప్పటికే మైక్‌లలో సైతం ప్రచారం చేశాం." - విశ్వేశ్వర నాయుడు, సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్
మళ్లీ జేసీబీలకు పనిచెప్పిన హైడ్రా - ఈసారి రూట్ మార్చిందిగా!