Former Vice President Venkaiah Naidu Restarts Amaravati Works : అమరావతిలో CRDA కార్యాలయ భవన పనులతో రాజధాని నిర్మాణానికి తిరిగి శ్రీకారం చుట్టడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. దీనిని అమరావతి పునర్నిర్మాణం కంటే పునరుజ్జీవంగా భావిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలని తాను ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నానని వెల్లడించారు. అసెంబ్లీ, ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారుల కార్యాలయాలు, కోర్టు భవనాలు ఇలా అన్నీ ఒకే చోట ఏర్పాటు చేయటం ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్నారు. హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయటం మరింత ప్రయోజనకరంగా ఉంటుందనేది తన ఉద్దేశమని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో వెల్లడించారు.
ఆ సందర్భం మరువలేనిది : పదేళ్ల క్రితం అమరావతికి శ్రీకారం చుట్టిన సందర్భం చారిత్రకమని, నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులతో కలిసి ప్రజా రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భం మరువలేనిదని వెంకయ్యనాయుడు గుర్తుచేసుకున్నారు. గతంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజధాని లేకుండా ఏర్పడిన కొత్త రాష్ట్రం అభివృద్ధిని ఆకాంక్షించి అమరావతి పట్టణ మౌళిక సదుపాయ కల్పనకు రూ.1000 కోట్లు కేటాయించానని గుర్తుచేసుకున్నారు. నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమరావతిలో కోర్ కేపిటల్ నిర్మాణానికి 2018 ఆగస్టులో శంకుస్థాపన చేశారని తెలిపారు.
నిర్మాణాలు ఆగిపోవటంతో బాధ కలిగింది : రాజధాని నిర్మాణానికి స్వచ్ఛంగా భూములు ఇవ్వటానికి ముందుకు వచ్చిన రాజధాని రైతుల భూములకు క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపులు ఇచ్చేలా చొరవ తీసుకున్నట్లు వెంకయ్య తెలిపారు. కారణాలు ఏవైనా గత ఐదేళ్లలో రాజధాని విషయంలో సందిగ్ధతలు, ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోవటం వంటివి ఒకింత బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు మళ్లీ పునర్నిర్మాణానికి మార్గం సుగమం కావటం, కేంద్ర ప్రభుత్వం సైతం తిరిగి సహకారం అందించేందుకు ముందుకు రావటం ఆనందదాయకమన్నారు.
ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు : అమరావతి రైతుల పట్టుదలను ప్రశంసించకుండా ఉండలేమని, పట్టు వదలకుండా, బెదరకుండా, అణచివేతలను ఎదుర్కొంటూ అమరావతి రైతులు సాగించిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భవిష్యత్ తరాల అభివృద్ధి దిశగా వారి త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అమరావతి కోసం సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం త్వరితగతిన పూర్తై, ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దేశానికి ఆదర్శంగా ముందుకు సాగాలని వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు.