Harish Rao Comments on Farmer Loan waiver : రేషన్‌కార్డులు ఉన్నవారికే రుణమాఫీ చేయడం సరికాదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయకపోవడం ప్రభుత్వం తప్పు కాదా అని ప్రశ్నించారు. రుణమాఫీకి రేషన్ కార్డు కాకుండా పాస్‌బుక్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఎలాంటి షరతులు లేకుండా రుణాలు మాఫీ చేశామన్నారు. పీఎం కిసాన్ రాష్ట్రంలో సగం మంది రైతులకు కూడా అందలేదని హరీశ్ రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలతో రైతులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.
కాంగ్రెస్ గతంలో ప్రకటించినట్లుగా రైతు భరోసా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభ సమావేశాల్లో సైతం రుణమాఫీపై ప్రశ్నిస్తామన్నారు. అధికారంలోకి రాకముందు 6 హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను మరిచిపోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రకటించినట్లుగా 6 గ్యారెంటీలను అమలు చేయలేదని, తాను గతంలోనే చెప్పానని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులకు భరోసా ఇవ్వాల్సింది పోయి, రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతోందని విమర్శించారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే, బీఆర్ఎస్ పార్టీ తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుందని హరీశ్ రావు హెచ్చరించారు.
రేషన్‌కార్డు నిబంధన లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే : హరీశ్‌రావు - BRS Party ON LOAN WAIVER
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు : పంట రుణాల మాఫీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం మార్గదర్శకాలు విడుదల చేసింది. పథకం అమలు విధి విధానాలను వివరిస్తూ జీవో జారీ చేసింది. ఒక రైతు కుటుంబానికి గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు రుణాలను మాఫీ చేయనుంది. అయితే రైతు కుటుంబం అర్హత గుర్తింపునకు తెల్లరేషన్ కార్డు(ఆహారభద్రత కార్డు)ను ప్రామాణికంగా తీసుకోనున్నట్లు ప్రకటించింది. అన్ని షెడ్యూల్డు, వాణిజ్య, ప్రాంతీయ గ్రామీణ, జిల్లా సహకార బ్యాంకుల నుంచి 2018 డిసెంబరు 12 నుంచి మంజూరైన, రెన్యువలైన రుణాలకు, 2023 డిసెంబరు 9 వరకు బకాయి ఉన్న పంట రుణాలకు, స్వల్పకాలిక రుణాలకు ఇది వర్తిస్తుందని, రుణాల అసలు, దానికి వర్తించే వడ్డీని కలిపి రూ.2 లక్షలు మాఫీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో స్పందించిన హరీశ్ రావు, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
రేషన్‌కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుకు లింకు పెట్టొద్దు : సీఎం రేవంత్ - TG Digital Health Profile Card