Phone Tapping Case Updates : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వే కొద్ది విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు బృందం, ఇద్దరు కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా పలువురి రాజకీయ నేతల ఫోన్లపై, ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. విచారణ అనంతరం వీరి పాత్ర ఉందని తేలితే దర్యాప్తు బృందం అరెస్టు చేసే అవకాశం ఉంది.
మరోవైపు దర్యాప్తు బృందం, రాధాకిషన్‌రావును విచారిస్తుండగా రక్తపోటు అధికం కావడంతో ఆయన ఆస్వస్థతకు గురయ్యారు. వైద్యులు ఆయనకు ఈసీజీతో పాటు రక్తపోటు తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు పోలీసులకు తెలిపినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేయకముందు అందులో ఉన్న డేటాను ఎందులో అయినా నిక్షిప్తం చేశారా? ఎవరు ఒత్తిడితో ఈ తంతంగం నడిపారు, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేశారు? ఎంతమందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు? వంటి కోణాల్లో రాధాకిషన్‌రావు దర్యాప్తు బృందం విచారిస్తున్నట్టు సమాచారం.
గతంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో, ప్రణీత్‌రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వివరాలను రాధాకిషన్‌రావుకు అందజేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈఘటన జరిగిన వ్యవసాయ క్షేత్రంలో సీసీ కెమెరాలు, ఆడియో రికార్డింగ్స్ ఎవరు చెబితే ఏర్పాటు చేశారు, అనే విషయంలోనూ దర్యాప్తు బృందం ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే రాధాకిషన్‌రావు తమను బెదిరించాడంటూ బాధితులు ఫిర్యాదు చేయడంతో వాటిని కూడా పోలీసులు పరిగణలోకి తీసుకునే అవకాశమున్నట్టు సమాచారం. రెండు రోజుల పోలీసు కస్టడీలో రాధాకిషన్‌రావు వెల్లడించిన అంశాల ఆధారంగా, మరికొంత మందికి దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తోంది.
EX DCP Radhakishan rao Bail Petition Dismissed : మరోవైపు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు నాంపల్లి కోర్టు బెయిల్ నిరాకరించింది. ఎల్‌ఎల్‌ఎం పరీక్షలు రాసేందుకు రాధాకిషన్‌రావు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల హడావుడిలో ఉండడం వలన ఆయనకు భద్రతతో కూడిన బెయిల్ కల్పించలేమని పోలీసులు కోర్టుకు తెలిపారు. రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎంలో పరీక్షలు తర్వాత రాసుకోవచ్చని పోలీసుల తరపును ప్రత్యేక పీపీ వాదనలు వినిపించారు. పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం రాధాకిషన్‌రావు మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరించింది.