Forest Department Invites to Visit the Sanctuary Located Miduturu Kurnool District : కర్నూలు జిల్లాలో ఉన్న ఆఫ్రికన్ సవన్నా ప్రాంతాన్ని తలపించే రోళ్లపాడు అభయారణ్యంలోని ప్రకృతి అందాలను తిలకించే సమయం వచ్చేసింది. వివిధ పక్షి జాతుల సందడి, కృష్ణజింకల పరుగులు, దుప్పుల గంతులు, అడవి తోడేళ్ల అరుపులు పక్షుల కిలకిలరావాల కనువిందు చేసే దృశ్యాలతో మిడతూరులో నెలకొన్న అభయారణ్యం సందర్శనకు అటవీ శాఖ ఆహ్వానం పలుకుతుంది. పక్షుల ప్రేమికులకు చక్కని అనుభూతిని అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతం్, పక్షులు, వన్యప్రాణుల సందర్శనలో భాగంగా నవంబర్ 1 నుంచి పర్యాటకుల సందర్శనకు ఈ అభయారణ్యాన్ని సిద్ధం చేస్తున్నారు.
పర్యావరణ విజ్ఞాన కేంద్రం : నల్లమల అరణ్యం విశిష్టతను వివరించేందుకు ఇక్కడ పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో నల్లమల వివరాలు, పక్షులు, వన్యప్రాణులు వాటి జీవన విధానంపై అవగాహన పెంపొందించేందుకు డాక్యుమెంటరీ ప్రదర్శిస్తారు. వీటితోపాటు రకరకాల పక్షుల వివరాలు తెలిపే చిత్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు.
అరకు లోయ టు లంబసింగి - ఆకాశం నుంచే అందాల వీక్షణ
బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రం : అంతరించి పోయే ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న పక్షి జాతుల్లో బట్టమేక పిట్ట ఒకటి. రాష్ట్రంలో 1998లో ఇవి సుమారు 25 వరకు ఉండేవి. రోళ్లపాడు ప్రాంతంలో ఇవి కనిపించడంతో వీటిని కాపాడేందుకు 1988లో అభయారణ్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ పక్షి మూడున్నర నుంచి నాలుగడుగుల ఎత్తు వరకు ఉంటుంది. గడ్డి మైదానంలో ఎక్కువగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో మిడుతూరు మండళం రోళ్లపాడులో 9.37 చ.కి.మీ విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఐదారేళ్ల కిందట బట్టమేక పక్షి వచ్చి గుడ్డు పెట్టి వెళ్లినట్లు గుర్తించారు. మళ్లీ రావడం లేదు.
విడిది- సఫారీ ఇలా : రోళ్లపాడును సందర్శించే పర్యాటకుల సౌకర్యార్థం వారికోసం అధికారులు ఇక్కడ విడిది కేంద్రం, సఫారీ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇక్కడ నాలుగు ఏసీ గదులు నిర్మించారు. ఒక్కో గదికి రూ.4 వేలు చెల్లించాలి. ఇద్దరు వ్యక్తులకు వసతి, భోజనం, సఫారీ కల్పిస్తారు. డార్మెటరీలో విడివిడిగా 8 బెడ్లు ఉన్నాయి. ఒక్కో బెడ్‌కు రోజుకు రూ.1500 చెల్లించాలి. డబ్లూడబ్లూడబ్ల్యూ.ఎన్‌ఎస్‌టీఆర్.కో.ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రోళ్లపాడు అభయారణ్యంలో గదులను బుక్ చేసుకోవచ్చు.