TS Food safety Officers Inspections on Hotels : ఏ సీజన్లో అయినా డల్ అవ్వని బిజినెస్ ఏదైనా ఉందంటే అది ఫుడ్ బిజినెస్ మాత్రమే. కానీ హోటళ్ల పేరుతో కొంతమంది చేస్తున్న అక్రమాలు తెలిసి, బయట ఫుడ్ తినాలంటేనే ఆలోచించాల్సి వస్తోంది. ఎందుకంటే పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు కావడమే ఇందుకు నిదర్శనం. తెలంగాణలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్‌క్రీం పార్లర్లు, కాఫీ షాప్‌లలోనూ ఇదే పరిస్థితి.
సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి నెలకొంది. నోరూరించే వాసనలు, ఆకర్షణీయ రంగులు, వేడివేడిగా వడ్డన ఆకట్టుకుంటున్నా తింటే అనారోగ్యం తథ్యం. వైద్య ఆరోగ్య శాఖ అధీనంలోని తెలంగాణ ఆహార భద్రత విభాగం గత 20 రోజులుగా 67 చోట్ల సోదాలు చేపట్టగా, సగానికి పైగా చోట్ల నిబంధనల ఉల్లంఘనలు, ఆహార కల్తీ ఉన్నట్లు తేలింది. నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. బాగా పేరొందిన, అత్యంత ప్రముఖ, ఆదివారం నాడు రద్దీతో కళకళలాడే కొన్ని రెస్టారెంట్లు, కాఫీ షాపులు, బేకరీల్లోనూ శుచీశుభ్రత లేని వంటశాలలు ఉన్నాయని అధికారులు గుర్తించారు.
చెడిపోయిన పదార్థాలు, బూజుపట్టిన కూరగాయలు, ఫ్రిజ్‌లలో వండి నిల్వఉంచిన పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల నకిలీ బ్రాండ్‌ల వాటర్ బాటిళ్లు, కోల్డ్ చైన్ లేకుండా నిల్వ ఉంచిన ఐటమ్స్, కాలం చెల్లిన మసాలాలు, చీజ్, సిరప్, శాండ్‌విచ్ బ్రెడ్‌లు, కల్తీ పదార్థాలు వెలుగుచూశాయి. ఓ ప్రముఖ సూపర్ మార్కెట్‌లో నిర్వహించిన తనిఖీల్లో చాక్లెట్లు గడువు తీరిపోయి, లీకవుతున్నట్లు నిర్ధారించారు. గతేడాది జీహెచ్‌ఎంసీ పరిధిలో 14,889 నమూనాలు సేకరించగా, వీటిలో 3,803 నమూనాలు సేకరించిన హోటళ్లకు నాణ్యత మెరుగుపర్చుకోవాలని సూచనలు చేశారు. 2,534 శాంపిళ్లు నాణ్యతగా లేవని, 311 శాంపిళ్లలో భారీగా కల్తీ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
తాజాగా తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కొన్ని :
- జహీరాబాద్ సమీపంలోని ఒక దాబాలో నూనెను ఎన్నిసార్లు వినియోగించారో గుర్తించలేని పరిస్థితి. మళ్లీ, మళ్లీ వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పనిచేయని ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన వాటినీ వినియోగిస్తున్నారు. వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నాయి.
- జూబ్లీహిల్స్‌లోని ఓ బార్ అండ్ కిచెన్‌లో వినియోగిస్తున్న పదార్థాల్లో గడువు ముగిసినవే ఎక్కువగా ఉన్నాయి.
- తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి సంబంధించిన రుచులు ప్రత్యేకం అన్న ప్రచారంతో లక్డీకాపుల్‌లో నిర్వహిస్తున్న రెస్టారెంట్‌లో పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలను, గడువు తీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు.
- హయత్‌నగర్‌లోని ఒక మండీలో కిచెన్ మురికిమయంగా ఉంది. మురుగునీరు, మూతలేని డస్ట్ బిన్‌లు, బొద్దింకలు, ఈగల మధ్య ఆహారం తయారు చేస్తున్నారు. సింథటిక్ రంగుల్ని వాడుతున్నారు.
- ఓ వెజ్ రెస్టారెంట్‌లో ఫంగస్ సోకిన క్యారెట్లు ఉన్నాయి. వండిన వెజ్ బిర్యానీని ఫ్రిజ్‌లో నిల్వ ఉంచారు. వంట గదిలో మురుగునీరు నిల్వ ఉంది. ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలకు లేబుళ్లు లేవు.
- హైదరాబాద్ బార్కస్‌లోని ఒక ఇండో అరబిక్ రెస్టారెంట్‌లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు వినియోగిస్తున్నారు. లేబుళ్లు లేని వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు.
- బంజారాహిల్స్‌లోని ఓ పెద్ద మాల్‌లోని పేరొందిన ఫుడ్‌స్టాళ్లలోని ఆహారంలో నాణ్యతలేదని తేలింది.
- ప్రఖ్యాత బిస్కట్‌ల బేకరీలో కాలం తీరిన బిస్కెట్‌లు, చాక్‌లెట్ కేక్‌లు, రస్క్‌లు, క్యాండీలు విక్రయిస్తున్నారు.
- ఒక ప్రముఖ ఐస్‌క్రీం ఔట్‌లెట్‌లో కాలం చెల్లిన స్ట్రాబెర్రీ పేస్ట్, నిల్వ నిబంధనలు పాటించని పైనాపిల్ టిట్‌బిట్ క్యాన్‌లు, తయారీ, ఎక్స్‌పైరీ తేదీలు లేని పేస్ట్రీలు, కేక్‌లు వాడుతున్నారు.
నాణ్యతా మృగ్యం : పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలావరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయని ఆహార భద్రత తనిఖీ అధికారి ఒకరు పేర్కొన్నారు. గడువు తీరినవి, ఎలాంటి బ్రాండ్ లేని పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొని వాడుతున్నారని వివరించారు. వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచుతున్నారని, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి, మసాలాలు కలిపి ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.