Farmers Happy with Krishna Water in Handriniva Canals : ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా కాలువల్లో కృష్ణా జలాల సవ్వళ్లతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పొలం ముంగిటే నీరు ప్రవహిస్తున్నా చెరువుకు నింపుకొనే అవకాశం లేకుండా ఇబ్బంది పడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోని అన్ని చెరువులు నింపేందుకు ప్రణాళిక చేసింది. వరుణుడు సైతం కరుణించడంతో 50 శాతం పైగా చెరువులు పుష్కలంగా నిండాయి. అప్పట్లో ఓట్ల కోసం నీటి రాజకీయం చేసిన చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ ముఖ్యనేత అనంత రైతులకు అన్యాయం చేసి సాగు నీటిని తరలించుకుపోతున్నారని మొరపెట్టుకున్నా కనీసం స్పందించని పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం జిల్లాలోని 214 చెరువులను కృష్ణా జలాలతో నింపడానికి అధికారులకు దిశానిర్దేశం చేసింది.
కృష్ణా జలాల సవ్వళ్లతో రైతుల్లో ఆనందం : ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రైతుల సాగునీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. సాగునీటి రంగానికి అప్పటి జగన్ సర్కారు నిధులివ్వకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడ్డారు. వర్షాలు పుష్కలంగా కురిసినా పొలాలకు నీరివ్వడంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కృష్ణా, తుంగభద్ర నీటిని ప్రణాళిక ప్రకారం కాలువలకు మళ్లిస్తూ ఎక్కడికక్కడ జలాశయాలు, చెరువులు నింపేలా అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాకు హంద్రీనీవా, హెచ్ఎల్సీ (HCL) కాలువలు గుండెకాయలాంటివి. ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా రైతులకు సాగు నీరందిస్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ కాల్వలపై గతంలోనే టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం మళ్లీ అధికారంలో ఉండటంతో హంద్రీనీవా నీటితో చెరువులు నింపి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని ప్రణాళిక చేసింది.
కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు
చెరువుల్లో పుష్కలంగా నీరు : కృష్ణా, తుంగభద్ర నదీ పరీవాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో పుష్కలంగా వర్షాలు కురవడంతో ఆయా నదులపై ఉన్న అన్ని జలాశయాల నుంచి నీటిని దిగువకు వదలాల్సి వచ్చింది. శ్రీశైలం జలాశయం నుంచి రోజూ 1500 క్యూసెక్కుల నీటిని హెచ్ఎన్ఎస్ఎస్ (HNSS) కాలువకు విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో చెరువులను నింపుతూ, మరోవైపు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించిన నీటిని జీడిపల్లిలో నిల్వచేశారు. హంద్రీనీవా కాలువ రెండు దశల్లోని చెరువులను నింపడానికి అధికారులు ప్రణాళిక చేశారు.
ఆర్కే బీచ్లో అలల తాకిడి - ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం - ఓఎన్‌జీసీ ప్లాంటును తాకిన సముద్ర జలాలు
రెండు పంటలకు నీరివ్వాలని రైతుల విజ్ఞప్తి : అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలం రాగులపాడు వద్ద హంద్రీనీవా నీరు అనంతపురం జిల్లాలో ప్రవేశించి, శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలం బొంతలపల్లి నుంచి చిత్తూరు జిల్లాలోకి వెళుతుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను నింపడానికి అవకాశం ఉన్న చెరువులు 214 ఉన్నాయి. ఈ ఏడాది జిల్లాలో కూడా పుష్కలంగా వర్షాలు కురిసి వాగులు, వంకలు పొంగిపొర్లడంతో ఆయా గ్రామాల్లోని చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. గతంలో సాగునీటి కోసం అనేక ఇబ్బందులు పడ్డామని చెబుతున్న రైతులు కూటమి ప్రభుత్వమైనా తమ సమస్యల్ని గుర్తించి రెండు పంటలకు నీరివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలతో నిండిన చెరువులను మినహాయించి మిగిలిన అన్ని చెరువులకు హంద్రీనీవా నీటిని ఇస్తామని జలవనరులశాఖ ఇంజనీర్లు చెబుతున్నారు.
పట్టిసీమకు గోదావరి పరవళ్లు - ఆనందంలో అన్నదాతలు - Pattiseema Lift Irrigation Project