TELANGANA AGRICUTURAL DEPARTMENT : వ్యవసాయమే జీవనాధారంగా దాదాపు 60% ప్రజలు జీవిస్తున్నారు. ఇందుకు ప్రధాన అవసరమైన సాగునీటిని అందించేందుకు గత ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి మూడున్నరేళ్లలో పూర్తి చేసింది. రైతుల్లో ఆత్మస్థైర్యం నింపి సరికొత్త పథకాలకు శ్రీకారం చుట్టింది. సాగునీరు అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసింది.
పంట పెట్టుబడికి ఎకరానికి ఏడాదికి 10 వేలు అందించే రైతుబంధు అందించింది. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతు ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందించేది. రైతు బీమా పథకం సహా రైతుబంధు సమితుల ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్‌కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించారు. రైతులు ఎరువులు, విత్తనాల కోసం ఇబ్బందులు పడకుండా వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
దీంతో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. ప్రభుత్వ ప్రత్యేక దృష్టితో తెలంగాణాలో ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరిగాయి. కాగా ఈ సారి యాసంగిలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని వ్యవసాయ శాఖముందే అంచనా వేసింది. సాగు విస్తీర్ణం తగ్గడం.. కీలక సమయంలో సాగునీరు అందక పంటలు ఎండిపోవడం, అకాల వర్షాలు, వడగళ్ల నష్టం వంటివి దిగుబడి తగ్గడానికి కారణమయ్యాయి.
రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయి, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో యాసంగికి సంబంధించిన నివేదికను వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసింది. గత యాసంగిలో 1.20 కోట్ల టన్నులుగా ఉన్న వరి దిగుబడి, ఈసారి 1.06 కోట్ల టన్నులకు తగ్గుతుందని తెలిపింది. అంటే 14 లక్షల టన్నుల మేర తగ్గుదల ఉంటుందని అంచనా వేసింది. మొక్కజొన్న గత యాసంగిలో 17.20 లక్షల టన్నుల దిగు బడి వస్తే, ఈసారి 15.37 లక్షల టన్నులే వచ్చే సూచనలు ఉన్నాయి.
దీని దిగుబడి 1.83 లక్షల టన్నుల మేర తగ్గనుంది. వేరుశనగ కూడా 2.32 లక్షల టన్నుల నుంచి 59వేల టన్నులు తగ్గి, ఈసారి 1.73 లక్షల టన్నులకే పరిమితం కానుంది. ఇక గత యాసంగిలో మొత్తం నూనె గింజల ఉత్పత్తి 2.70 లక్షల టన్నులు కాగా, ఇప్పుడు 61వేల టన్నులు తగ్గి 2.09 లక్షల టన్నులకు పడిపోనుంది. మొత్తంగా యాసంగిలో కీలక పంటల దిగుబడులన్నీ తగ్గనున్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
ప్రకృతి విపత్తులు లాంటి కారణాలతో పంటల దిగుబడి తగ్గుతుండగా, రైతులు ప్రత్నామ్నాయ పంటలవైపు దృష్టి సారిస్తే మేలైన ఫలితాలు ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. కాగా గత యాసంగి నుంచి ఉప్పుడు బియ్యం సేకరణ ఉండబోదని కేంద్రం ప్రకటించింది. దీంతో వరి సాగుకు అనుకూలమైన భూములను వదిలేస్తే మిగిలిన భూముల్లో వైవిధ్యమైన పంటలు పండించవచ్చని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత వసతులను సద్వినియోగం చేసుకుని మార్కెట్లో డిమాండ్ ఉన్న వివిధ రకాల ఇతర పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. భూసారం, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రత్యమ్నాయ పంటల వైపు దృష్టి మళ్లించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. నిరంతరాయంగా వరి పంట వల్ల భూసారం పూర్తిగా క్షీణించి డొల్లగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ప్రత్యామ్నాయంగా వేరుశనగ, కంది, పొద్దుతిరుగుడు, పప్పు ధాన్యాలు, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
గతంలో పుష్కలంగా నీటితో పాటు విద్యుత్ అందుబాటులో ఉండేదని, ప్రస్తుతం మారుతున్న కాలానికి అణుగుణంగా పంటలు పండించడంలో రైతులు మారాల్సిన పరిస్థితి ఉందని సూచిస్తున్నారు.కేవలం ప్రభుత్వ కొనుగోళ్లపైనే ఆధారపడకుండా స్వయంగా విక్రయించుకొనే విధంగా అనేక పంటలు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అవసరాలను బట్టి రైతులు గ్రామాల వారీగా పంటలు వేసుకోవడమే కాకుండా స్వయంగా మార్కెంటింగ్ చేసుకొనేందుకు వేరుశనగ, మొక్కజొన్నతో పాటు కూరగాయల సాగుకు మంచి అవకాశం ఉందని సూచిస్తున్నారు. వరితో పోలిస్తే తక్కువ పెట్టుబడితోనే ఆయా పంటలు వేసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు మానేసి పూర్తిగా వరిపంటపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఇతర పంటలకు అనేక రకాల ప్రోత్సహకాలు ఉండేవని వాటిని పూర్తిగా ఎత్తివేయడంతో రైతులు వరిపంటకే మొగ్గు చూపుతున్నారు. కూరగాయల విత్తనాలు, ఇతరత్రా నాణ్యమైన విత్తనాల అందుబాటు, వ్యవసాయ శాఖ నుంచి సలహాలు, సూచనలు పూర్తి స్థాయిలో లభించేవని రైతులు చెబుతున్నారు.
అధికారులు రైతుబంధు కోసం పేర్లు నమోదు చేసి చేతులు దులుపు కోవడం తప్ప కొత్త పంటల గురించి అవగాహన కల్పించడం లేదు. ప్రత్యామ్నాయ పంటల విషయంలో కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగితే తప్ప అటు వైపు వెళ్లే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. వరి పంట కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ప్రకటనలు చేయడం కాకుండా వివిధ పంటలు వేసే రైతులకు సూచనలతో పాటు ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తే వరి కాకుండా ఇతర పంటలపై దృష్టిసారిస్తామని రైతులు అంటున్నారు.