Family Suicide Due to Online Betting Debts : లోన్, బెట్టింగ్ యాప్‌లతో అప్పులు చేసి తీర్చే మార్గం లేక ఎంతోమంది బలైపోతున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో మరో కుటుంబం బలైంది. కుమారుడు బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. సంతోషంగా ఉన్న కుటుంబాల పాలిట బెట్టింగ్ యాప్‌లు యమపాశాలుగా మారుతున్నాయి.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగణవేని సురేశ్, హేమలతలు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కుమారుడు హరీశ్(22) పదో తరగతి వరకు చదివి మానేశాడు. అద్దె ఇంట్లో ఉంటూ కిరాణం దుకాణం నడుపుతున్నారు. వ్యవసాయం, కిరాణం మీద వచ్చే ఆదాయంతో కుటుంబంతో సంతోషంగా ఉండేది. అయితే కరోనా సమయంలో హరీశ్, ఆన్లైన్ బెట్టింగ్, పబ్జీ గేమ్‌లకు అలవాటు పడ్డాడు. ఇలా ఆడుతూనే దాదాపు రూ.30 లక్షలు అప్పు చేశాడు. కుమారుడు చేసిన అప్పులు తీర్చడానికి తమకున్న ఎకరం వ్యవసాయ భూమిని అమ్మేసి రూ.12 లక్షలు తల్లిదండ్రులు చెల్లించారు. అయినా అప్పులు పూర్తిగా తీరలేదు. ఇంకా సుమారు రూ.18 లక్షల అప్పు ఉండటంతో ఏం చేయాలో పాలుపోలేదు.
ప్రాణం తీసిన బెట్టింగ్ : కుటుంబానికి ఆధారంగా ఉన్న భూమి పోయింది. కిరాణా దుకాణంతో వచ్చేది అంతంతమాత్రంగానే ఉంది. పిల్లర్ల దశకు వచ్చిన ఇంటి నిర్మాణం సైతం ఆగిపోయింది. దీనికి తోడు మిగిలిన అప్పు ఎలా తీర్చాలో తెలియక, తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో కుమారుడు హరీశ్‌తో కలిసి తండ్రి సురేశ్, తల్లి హేమలతలు ఇంట్లోనే చీరతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్దని ఎంత మొత్తుకుంటున్నా, పెడచెవిన పెడుతున్న యువత అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఈ వ్యసనం వదలలేక అప్పులు చేస్తూ ఇలా కుటుబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నారు. ఇలా యువత ప్రాణాలు తీసే స్థాయికి బెట్టింగ్ మహమ్మారి విస్తరించడం సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది.
రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్ - ఆగమవుతున్న యువత - online betting games and apps