Fake Currency Gang Attack on Police : పోలీసుల వాహనాన్ని దొంగనోట్ల ముఠా అడ్డగించి దాడికి పాల్పడింది. మరో కారు, ఇతర వాహనాలతో వెనక నుంచి ఢీకొని పోలీసు బృందంపై దాడి చేసి వాహనంలో ఉన్న నిందితుడిని తప్పించారు. అడ్డొస్తే చంపుతామని పోలీసులను బెదిరించారు. మళ్లీ వెంట పడకుండా పోలీసుల వాహన తాళం తీసుకుని దుండగులు పరారయ్యారు. ఈ ఘటన తూర్పు గోదావరిలోని రాజమహేంద్రవరంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం పోలీసు స్టేషన్ పరిధిలో దొంగ నోట్ల కేసులో రవి, రాజేష్ అనే ఇద్దరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారు ఇచ్చిన సమాచారంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన రాపాక ప్రభాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డి, రాజమహేంద్రవరానికి చెందిన కృష్ణ మూర్తిని ప్రధాన నిందితులుగా గుర్తించారు. ప్రతాప్ రెడ్డి, కృష్ణ మూర్తిని అరెస్టు చేసేందుకు జి.సిగడాం పోలీసులు ఈ నెల 12న భీమవరం వచ్చారు. భీమవరంలో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఓ హోటల్‌లో నుంచి బయటకు వస్తున్న ప్రతాప్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ప్రకాశం నగర్ స్టేషన్ పోలీసులను కలిసి కృష్ణ మూర్తి వివరాలు తెలియజేసి అతడి కోసం గాలించారు.
కరెన్సీ నోట్లు కావవి - కలర్ జిరాక్స్
నిందితుడితో పరార్ : కృష్ణమూర్తి వివరాలు లభించకపోవడంతో అర్ధరాత్రి పన్నెండున్నర దాటిన తర్వాత తిరిగి శ్రీకాకుళం పయనం అయ్యారు. మరోవైపు ప్రతాప్ రెడ్డి ముఠా సభ్యులు సుమారు 25 మంది రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలపై పోలీసు వాహనాలను వెంబడిస్తూ రాజమహేంద్రవరం వరకూ వచ్చారు. అర్ధరాత్రి శ్రీకాకుళం బయలుదేరిన పోలీసులను ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఎల్ పురం వెళ్లే మార్గంలో అడ్డుకున్నారు. అనంతరం పోలీసులపై ప్రతాప్ రెడ్డి ముఠా సభ్యులు దాడికి దిగారు. అడ్డొస్తే చంపుతామని పోలీసులను బెదిరించారు. నిందితుడైన ప్రతాప్ రెడ్డిని తమతో తీసుకెళ్లారు. మళ్లీ వెంట పడకుండా పోలీసుల వాహన తాళం తీసుకుని దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. దాడిలో వీరి వాహనం అద్దాలు పగిలాయి. ఘటనపై రాజమహేంద్రవరంలోని ప్రకాశం నగర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దొంగ నోట్ల ముఠా అరెస్ట్- రూ.10లక్షలకు రూ.44 లక్షల నకిలీ కరెన్సీ - Fake Currency Gang Arrest