Exclusive Story on Armoor Leather Park : ఎప్పటికప్పుడు అధికార పార్టీల ప్రకటనలు, అధికారుల హడావిడి, ఆ తరువాత అంతా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారైంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లెదర్ పార్క్ పరిస్థితి. భూమి అందుబాటులో ఉన్నా, ఫలితం మాత్రం కనిపించటం లేదు. చర్మకారుల్ని, చేతివృత్తులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లెదర్ పార్కులను ఏర్పాటు చేయాలని 2002లో సంకల్పించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్సీ జనాభా ఎక్కువగా ఉండడం, అందులోనూ చర్మకారుల సంఖ్య గణనీయంగా ఉండడంతో ఆ వృత్తిదారులను ప్రోత్సహించే ఉద్దేశంతో జిల్లాలో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 2003 అగస్టు 20న లెదర్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. జిరాయత్ నగర్ యానంగుట్ట ప్రాంతంలో 28 ఎకరాలు కేటాయించి ఒక షెడ్డు నిర్మించారు. అంతే, అది అంత వరకే పరిమితమైంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18 లెదర్ పార్క్‌లలో ఆర్మూర్‌లో ఒకటి ప్రతిపాదించగా, మిగతావి హైదరాబాద్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఆర్మూర్ లెదర్ పార్క్ ఏర్పాటులో ఆది నుంచి తూతూ మంత్రం చర్యలే ఉన్నాయి. చర్మకారులకు శిక్షణ ఇవ్వడానికి ఒక షెడ్డు నిర్మించారు. కుట్టు మిషన్లు తెప్పించారు. కొంత మందిని ఎంపిక చేసి, చెన్నైలోని ఫుట్ పార్క్ శిక్షణ సంస్థల్లో, మరికొందరికి హైదరాబాద్‌లో చెప్పులు, బ్యాగ్‌లు తదితర చర్మ ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇప్పించారు. ఇలా వివిధ ప్రాంతాల్లో శిక్షణ పూర్తి చేసుకున్న వారితో ఇక్కడ మరికొంత మందికి శిక్షణ ఇప్పించారు. ఆ తరువాత అంతగా పట్టించుకోకపోవడంతో లెదర్ పార్కు ఏర్పాటు ముందుకు సాగలేదు.
మళ్లీ తెరపైకి పసుపు బోర్టు .. ఈసారైనా రైతుల కల నెరవేరుతుందా..?
కేంద్ర ప్రభుత్వం ఆర్మూర్‌లో లెదర్ పార్క్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గతంలో లిడ్ క్యాప్ ఎండీతో పాటు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సంచాలకులు, ఇతర అధికారులు వచ్చి పరిశీలించారు. రూ.10 కోట్లు వెచ్చించి పార్క్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇదంతా జరిగి ఏళ్లు గడుస్తున్నా మళ్లీ కదలిక లేదు. అప్పటి నుంచి పార్క్‌ను పట్టించుకునేవారు కరువయ్యారు. లెదర్ పార్కు భూమి అన్యాక్రాంతం కాకుండా గతంలో కేటాయించిన నిధులతో చుట్టూ ప్రహరీ గోడ, మరో భవనం నిర్మిస్తున్నారు. ఇది ప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
కేంద్రం నిధులు వెనక్కి : ఆర్మూర్‌లోనే 300కు పైగా చర్మకార కుటుంబాలు ఉండగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు పది వేల మందికి ఉపాధి లభిస్తుందని గతంలోనే లెక్కలేశారు. లెదర్ పార్కును కేంద్రం 80, రాష్ట్రం 20 శాతం వాటాతో ఏర్పాటు చేయాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా నిధులను కేటాయించకపోవడంతో గతంలో రెండుసార్లు కేంద్రం నిధులు వెనక్కి వెళ్లిపోయాయని చర్మకార సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. దీంతో పనులకు మోక్షం లభించడం లేదని అంటున్నారు.
Farmer Wear Chappal After Turmeric Board : పసుపు బోర్డు వచ్చింది.. కాలికి చెప్పులు వచ్చాయ్..!
గత రెండు దశాబ్దాల్లో పలు ప్రభుత్వాలు మారినా ఆర్మూర్ లెదర్ పార్క్‌కు మాత్రం మోక్షం కలగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీనికి శంకుస్థాపన జరగగా, ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కొనసాగింది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, బీఆర్ఎస్ అధికారం చేపట్టినా దీని ఏర్పాటుకు అడుగులు పడలేదు. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఆర్మూర్‌కు వచ్చిన ప్రతి నాయకుడు లెదర్ పార్కు ప్రస్తావన తెస్తారు. ఎన్నికలు అయిపోగానే మళ్లీ దాని ఊసే ఎత్తరని మోచీలు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల మోచీ సంఘం ప్రతినిధులు సైతం సీఎంను కలిశారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి తోళ్ల పరిశ్రమ ఏర్పాటు చేస్తే వేల మందికి ఉపాధి దొరుకుతుందని మోచీలు అంటున్నారు.
ఆదాయం లేక ఇతర వృత్తుల వైపు : ఆర్మూర్ లెదర్ పార్కు ప్రారంభం కాకపోవడం వల్ల మోచీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే పేదరికం, చెప్పుల దుకాణాలు ఏర్పాటు చేసుకునే స్థోమత లేదు. ఒకవేళ ఏర్పాటు చేసుకున్నా కిరాయిలు భరించే ఆర్థిక పరిస్థితి అంతకన్నా లేదు. దీంతో అనేక మంది ఫుట్‌పాత్‌ల పైనే చిన్న గొడుగు కింద చెప్పులు కుట్టుకుంటూ బతుకుతున్నారు. దుకాణదారులకు కోపమొచ్చినా, మున్సిపల్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసినా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన దుర్భర పరిస్థితిలో ఉన్నామని మోచీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజంతా కష్టపడినా కుటుంబాన్ని పోషించలేని పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు. దశాబ్దాలుగా కుల వృత్తిని నమ్ముకుని బతుకుతున్నా, సరైన ఆదాయం లేక ఇతర వృత్తుల వైపు మళ్లాల్సిన దుస్థితి తలెత్తుతోందని అంటున్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా కాలయాపన చేయకుండా ఆర్మూర్ లెదర్ పార్క్‌ను ఏర్పాటు చేయాలని స్థానిక చర్మకారులు కోరుతున్నారు. లేదంటే కులవృత్తిని పూర్తిగా వదిలేసి రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లెదర్ పార్కు అందుబాటులోకి వస్తే కులవృత్తిని కాపాడుకోవడంతో పాటు కుటుంబాలు బాగు పడతాయని అంటున్నారు.
నిజాం షుగర్స్‌పై ప్రభుత్వం ఫోకస్- ఫ్యాక్టరీకి పూర్వవైభవం వచ్చేనా?