Irregularities in State Excise Department : వైఎస్సార్సీపీ పాలనలో ఎక్సైజ్ శాఖలో ఐదేళ్లు చక్రం తిప్పిన అధికారి గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరులో అమ్మవారి ఆలయ పునఃనిర్మాణానికి ఆ అధికారి బినామీ పేర్లతో విరాళం ఇచ్చారు. దాతలు వరంగల్‌కు చెందిన వ్యక్తులుగా చెబుతున్నా వారి వెనుక ఆ అధికారి ఉన్నారనేది బహిరంగ రహస్యం. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అమ్మవారికి పేరుంది. కొందరి ద్వారా ఈ సమాచారం తెలుసుకున్న అధికారి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు.
దేవదాయశాఖ అధికారులు, పాలకవర్గం ఆలయ పునఃనిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ఆ అధికారి ఆలయానికి వచ్చారు. అధికారి తమ బంధువుల పేర్లతో విరాళం ఇచ్చేందుకు సిద్ధమై ఆలయ అధికారులతో ఒప్పందం చేసుకున్నారు. రూ.2కోట్ల విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చిన అధికారి మరో రూ.50లక్షలు అదనంగా ఇవ్వడానికైనా సిద్ధమేనని అంతా రాళ్లతో నిర్మించాలని సూచించారు. ఆలయ పునఃనిర్మాణానికి దేవాదాయశాఖ రూ.కోటి మంజూరు చేసింది. మొత్తం రూ.3.5 కోట్లతో గుత్తేదారు పనులు చేస్తున్నారు. మంచికలపూడికి చెందిన ఒక వైఎస్సార్సీపీ నాయకుడిని ఎంపికచేసుకున్నారు. అతడే పని జరుగుతున్న విధంగా కూలీలకు నగదు ఇవ్వడం, లావాదేవీలు చేయడం వంటి చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమ్మవారి ఆలయ నిర్మాణ రూపాన్నే మార్చేశారు.
నెలన్నరగా అజ్ఞాతంలో వాసుదేవరెడ్డి - చర్యలు ఎప్పుడు ? - Former APSBCL MD Absconded
రాజు తలుచుకుంటే దెబ్బలకు, డబ్బులకు కొదువా అన్న చందాన చెలరేగిపోయారు. ఆలయంలో అమ్మవారి విగ్రహం ఉండే మండపానికి విమానగోపురం, అనుసంధానంగా నిర్మిస్తున్న సుబ్రహ్మణ్యస్వామి, వినాయకుని ఉపాలయాలు, ఆలయం ముందు నిర్మిస్తున్న రాజగోపురం అన్నింటినీ స్లాబ్ వరకూ రాళ్లతో ఆపైన ఇటుకలతో నిర్మించాలని దేవదాయశాఖ భావించింది. అలా వద్దని మొత్తం రాయితోనే కట్టేద్దామని ఎంత ఖర్చు అయినా తాను ఇస్తానని అధికారి చెప్పడంతో ఆలయ ఆకృతిని మొదట్లోనే మార్చేశారు. ప్రస్తుతం ఆలయ పనులు మొత్తం రాయితోనే జరుగుతున్నాయి.
కంఠంరాజు కొండూరు అమ్మవారి ఆలయానికి 1.5కిమీ దూరంలో చిలువూరులో సదరు అధికారి బినామీ పేరుతో 5 ఎకరాలు కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఇక్కడ ఎకరం విలువ రూ.80లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంది. మద్యం ద్వారా వచ్చిన అక్రమ సొమ్ముతో బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి ఎవరికైనా బంగారం రూపంలోనే బహుమతులు ఇచ్చేవారని తెలిసింది. అక్రమ సంపాదనతోనే ఈ వ్యవహారాలు నడిపినట్లు చర్చ జరుగుతోంది.