Ex CM Kiran Kumar Reddy Meet Palamaner MLA: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని ఆయన నివాసంలో కలసి తేనేటి విందులో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, అమర్నాథ్ రెడ్డి తండ్రి, మా తండ్రి మంచి మిత్రులని తెలిపారు. అదే విధంగా తాను, అమర్నాథ్ రెడ్డి అదే స్నేహాన్ని కొనసాగిస్తున్నామని, శాసన సభ్యులుగా ఇద్దరమూ చాలా సంవత్సరాలు పనిచేశామని అన్నారు.
జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి ప్రజలు ఇచ్చిన భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగిందని అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా 15 వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తోందని తెలియజేశారు. అరాచక వైఎస్సార్సీపీ పాలనకు చరమగీతం పాడుతూ ప్రజలు తీర్పు ఇచ్చారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ నాయకుల బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.
దేశంలోనే అతిపెద్ద, గొప్ప ప్రాజెక్టు పోలవరమని, పోలవరం పూర్తయితే, అనేక ఎకరాలకు, కొత్త ఆయకట్టుకు సాగునీరు సాగునీరు అందుతుందని, అంతేకాకుండా 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరెంట్ యూనిట్ 10 నుంచి 15 పైసలకే తయారు చేయవచ్చని , కృష్ణా వాటర్ రాయలసీమకు అందుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందని, వాటన్నింటినీ కూటమి ప్రభుత్వం సమర్ధంగా సరిచేసి, పాలనను గాడిలో పెట్టి, సుపరిపాలన అందించే విధంగా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రభుత్వం కృషిచేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ, కీలపట్ల దేవస్థానంను టీటీడి పరిధిలో తేవడానికి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఎంతో ఉందని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీలపట్ల దేవస్థానాన్ని టీటీడీ పరిధిలో తేవడం జరిగిందని గుర్తు చేసుకున్నారు. ఈరోజు కీలపట్ల దేవస్థానం ఎంతగా అభివృద్ధి అయిందో అందరం చూస్తూనే ఉన్నామని, ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకు ధన్యవాదాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా కీలపట్లకు వెళ్లడానికి సింగిల్ రోడ్డు దారి ఉందని, దాన్ని డబుల్ రోడ్డు చేస్తే ఎంతో ప్రాచీనమైన గుడి మరింత అభివృద్ధి చెందుతుంది అని విలేకరులు ప్రస్తావించగా, ఖచ్చితంగా ఆ రోడ్డు వెడల్పు చేసే అంశాన్ని ప్రయత్నం చేస్తామని ఈ అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.