ETV Complaints on Fake Videos : తెలుగునేలపై నిఖార్సైన వార్తలకు నమ్మకమైన బ్రాండ్ ఈటీవీ! ఎన్నికల వేళ ఈటీవీ విశ్వసనీయతను అడ్డుపెట్టుకుని కొందరు ఫేక్ ఫెలోస్ తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు. ఈ దుష్ప్రచారానికి తెగించిన నకిలీ ముఠాలపై చర్యలు తీసుకోవాలని ఈటీవీ యజమాన్యం తెలంగాణలోని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Fake Video in The Name of ETV : ఎన్ని ఛానళ్లు పుట్టుకొచ్చినా తెలుగువారు ఈటీవీ తెరపై చూస్తే తప్ప వార్తల్ని నమ్మరు. ప్రేక్షకుల్లో అంతటి విశ్వసనీయత సంపాదించుకున్న ఈటీవీ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఇప్పుడు కొందరు మాయగాళ్లు ఫేక్ వీడియోలు సృష్టిస్తున్నారు. కీలకమైన ఎన్నికల్లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు. ఏపీలో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చిందంటూ ఈటీవీ స్క్రీన్‌ను పోలిన ఒక వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
వైసీపీ తప్పుడు వీడియోలు - తెరపైకి ఫేక్ పరిశ్రమ : చంద్రబాబు - vigilance on YCP fake videos
ఈటీవీతో పాటు ఏకంగా కేంద్ర నిఘా వ్యవస్థనూ బద్నాం చేసేందుకు బరి తెగించారు. తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ మ్యానిఫెస్టో రద్దు అని ఒకటి, తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు తీరుపై జనసేన పార్టీ ఆగ్రహం అంటూ మరొక వీడియోను ఈటీవీ ఏపీ లోగోతో పాటు ఛానల్ తాజా సమాచారం ప్రసారం చేసే సమయంలో వాడే మ్యూజిక్‌తోనే సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు.
ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తున్న ఫేక్ వీడియోలపై ఈటీవీ ఆంధ్రప్రదేశ్ యాజమాన్యం హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తప్పుడు వార్తలు వ్యాపింపజేసిన వారి సోషల్ మీడియా ఖాతాల వివరాలు, ఐపీ అడ్రస్‌లు గుర్తించి ఆధారాలు అందజేసింది. ఛానల్ పేరును దుర్వినియోగం చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈటీవీ యాజమాన్యం పోలీసుల్ని కోరింది.
Chandrabau Naidu Reacts on Fake Videos : మరోవైపు ఈవీడియోలపై చంద్రబాబు నాయుడు స్పందించారు. వైసీపీ సోషల్ మీడియా తప్పుడు వీడియోలతో గందరగోళం సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఈటీవీ విశ్వసనీయత దెబ్బతీసేలా, ఆ ఛానల్ పేరుతో ఫేక్ వీడియోలు చేస్తోందని మండిపడ్డారు. ఫేక్ ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమర్థంగా తిప్పికొట్టాలని టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
తప్పుడు ప్రచారాలు సృష్టించి - ప్రతిపక్షాలపై తోసేయడం వైఎస్సార్సీపీ నేతల నైజం - ysrcp fake propaganda