Bapatla politics: బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం, ఎందరో ప్రముఖులు ప్రాతినిథ్యం వహించిన ప్రాంతం. గతంలో జనరల్‌గా ఉన్న బాపట్ల, 2009 పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడుగా మారింది. సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ వైసీపీ నుంచి మరోసారి బరిలోకి దిగగా, కూటమి అభ్యర్థిగా విశ్రాంత పోలీస్ అధికారి టీ.కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామనే విశ్వాసంతో ఉంది. అధికార పార్టీ అరాచకాలు, సిట్టింగ్ ఎంపీ వైఫల్యాలతో పాటు, నియోజకవర్గంలో గెలుపు ఓటములు ప్రభావితం చేసే అంశాలేంటో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
బాపట్ల లోక్‌సభలో 15లక్షల 6వేల 354మంది ఓటర్లుండగా,అందులో పురుషులు 7లక్షల35వేల 291మంది, మహిళలు 7లక్షల 70వేల 978మంది ఉన్నారు. ఈ నియోజకవర్గం రెండు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. బాపట్ల జిల్లాలోని 6 అసెంబ్లీ స్థానాలతో పాటు.. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు కూడా ఈ నియోజకవర్గ పరిధిలోకే వస్తుంది. 1977లో బాపట్ల నియోజకవర్గం ఏర్పాటు కాగా, మొదట్లో జనరల్‌గా ఉండేది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడుగా మార్చగా, కాంగ్రెస్ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలిచారు. ఆ తర్వాత 2014లో తెలుగుదేశం అభ్యర్థి శ్రీరాం మాల్యాద్రి, 2019లో వైసీపీ అభ్యర్థి నందిగం సురేష్ విజయం సాధించారు. ఈసారి ఇక్కడి నుంచి తెలుగుదేశం తరపున టి.కృష్ణప్రసాద్, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ బరిలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి.
2019ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గాలి వీచినా, బాపట్ల పార్లమెంట్ పరిధిలో 4 అసెంబ్లీ స్థానాల్ని తెలుగుదేశం గెలుచుకుంది. 3 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలిచినా, ఎంపీ సీటు కూడా ఆ పార్టీకే దక్కటం విశేషం. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో వైసీపీ ప్రాభవం కోల్పోయింది. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో వైసీపీకి కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎంపీగా గెలిచినప్పటి నుంచి నందిగం సురేష్ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కువగా రాజధాని ప్రాంతంలోని తన ఇంట్లో లేదా, తాడేపల్లిలో ఉంటారని, నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి, గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియాను నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పుకోలేని దుస్థితి సురేష్‌ది. ఇక్కడి సమస్యల గురించి పార్లమెంటులో ప్రస్తావించి పరిష్కరించిందీ లేదనే భావన జనాల్లో వినిపిస్తోంది.కేవలం జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. తెలుగుదేశం నుంచి విశ్రాంత ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ పోటీ చేస్తున్నారు. ఈయన ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశారు. శాంతిభద్రతల అమలులో మంచి పేరుంది. అలాగే హైటెక్ సిటీ నిర్మాణం, శంషాబాద్ విమానాశ్రయం, హైదరాబాద్ రింగ్ రోడ్డు భూసేకరణ సమయంలో మౌలికవసతుల సదుపాయల సంస్థ అధికారిగా పనిచేశారు. ఇప్పుడు తనను ఎంపీగా గెలిపిస్తే బాపట్ల నియోజకవర్గ అభివృద్ధికి, ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని చెబుతున్నారు.
బాపట్ల పార్లమెంట్ పరిధిలో బాపట్ల అసెంబ్లీతో పాటు.. వేమూరు, రేపల్లె, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు సెగ్మెంట్లు ఉన్నాయి. ప్రకాశం జిల్లా పరిధిలో ఉండే సంతనూతలపాడులో సుధాకర్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈసారి ఆయన్ను కాదని, వేమూరు నుంచి గెలిచిన మేరుగు నాగార్జునను వైసీపీ బరిలోకి దించింది. మంత్రి నాగార్జున ఎన్నికలకు నాలుగు నెలల ముందు అక్కడకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఆయన ఇళ్లు చక్కబెట్టుకునే లోపే పరిస్థితి తెల్లారింది. తెలుగుదేశం నుంచి విజయ్‌కుమార్ పోటీ చేస్తున్నారు. వివాదరహితుడిగా విజయ్‌కుమార్‌కు పేరుంది. 2009లో ఈయన కాంగ్రెస్ తరపున ఇక్కడ నుంచి గెలవగా, 2014, 2019లో తెలుగుదేశం తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి మాత్రం ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉన్నా, తెలుగుదేశం వైపే స్వల్పంగా మొగ్గు కనిపిస్తోంది.
బాపట్లలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతి పోటీ చేస్తున్నారు. గతంలో రెండుసార్లు గెలిచారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నరేంద్ర వర్మ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ఇసుక అక్రమ వ్యాపారాలు, కబ్జాల ఆరోపణలతో పాటు.. సొంత పార్టీ నేతలను పట్టించుకోరనే విమర్శలు కూడా, కోనపై ఉన్నాయి. ఐదేళ్లలో నియోజకవర్గానికి ఏం సాధించారో చెప్పలేని పరిస్థితి. తెలుగుదేశం, వైసీపీ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. వేగేశన నరేంద్రవర్మ, బాపట్ల అసెంబ్లీ కూటమి అభ్యర్థి
రేపల్లె నుంచి తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణని కాదని ఈవూరి గణేష్ అనే వైద్యునికి వైసీపీటికెట్ ఇచ్చింది. అనగాని హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. సొంత సామాజికవర్గం అయిన గౌడ ఓటర్లు అండగా ఉండడం ఆయన బలం. నియోజకవర్గంలో మోపిదేవి కుటుంబం చేసిన అరాచకాలు వైసీపీకి మైనస్ కానున్నాయి. ఈపూరి గణేష్ 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన్ను తెచ్చి బరిలోకి దింపినా వైసీపీకి ఆదరణ రావటం లేదు. ప్రజల ఆకాంక్షగా ఉన్న నిజాంపట్నం, వాడరేవు హార్బర్ల నిర్మాణాలను, కేంద్రం నిధులు ఇచ్చినా ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. తీర ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అడుగులు పడలేదు. దీంతో సముద్రంపై ఆధారపడి జీవించే వారి జీవితాల్లో మార్పులు రాలేదు. ఆక్వా అభివృద్ధికి చేసిందేం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు విస్తారంగా ఉన్నా వారికి సరైన రాయితీలు, ప్రోత్సాహకాలు అందించలేదు. దీంతో ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మూడోసారి అనగాని గెలుపు పక్కా అనే ప్రచారం వినిపిస్తోంది.
ఐదేళ్లలో మహిళలకు జగన్ ఏం చేశారు? - ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చారా! - ETV Bharat Prathidwani
వేమూరు నుంచి తెలుగుదేశం తరపున నక్కా ఆనంద్‌బాబు పోటీ చేస్తున్నారు. 2009, 2014లో గెలిచిన ఆనంద్‌బాబు వివాదరహితునిగా, ప్రజలకు మంచి చేస్తారనే పేరుంది. గతంలో ఇక్కడ గెలిచిన మేరుగు నాగార్జున మంత్రి అయినా నియోజకవర్గానికి చేసిందేం లేదనే విమర్శ ఉంది. ఇప్పుడు వైసీపీ తరపున వరికూటి అశోక్‌బాబుని పోటీ చేయిస్తున్నారు. ఈయనపై స్తిరాస్థి వ్యాపారంలో మోసం చేసిన కేసులు ఉన్నాయి. ఇక్కడకు వచ్చి రాగానే కులాల మధ్య గొడవలు పెట్టడం, ఎన్ఆర్ఐ లను బెదిరించారనే ఆరోపణలు వచ్చాయి. నక్కా ఆనంద్‌బాబు గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈస్థానంలో నక్కా ఆనంద్‌బాబు గెలుపు ఖాయంగా కనిపిస్తోంది.
పర్చూరు నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తెలుగుదేశం తరఫున బరిలో ఉండగా, ఆయనకు పోటీగా యడం బాలాజీని వైసీపీ నిలబెట్టింది. గతంలో ఇక్కడ ఇన్‌ఛార్జ్‌లుగా పనిచేసిన రావి రామనాథం బాబు, ఆమంచి కృష్ణమోహన్‌ను వైసీపీ మార్చింది. యడం బాలాజి కంటే ఏలూరి చాలా ముందంజలో ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. గతంలో తాను చేసిన అభివృద్ధిని చూడాలని కోరుతున్నారు. కేవలం జగన్ చెబుతున్న సంక్షేమంపై ఆధారపడే బాలాజీ ఓట్లు అడుగుతున్నారు. మొత్తంగా ఈసారి కూడా ఏలూరి సాంబశివరావు అసెంబ్లీలో అడుగు పెడతారనే అబిప్రాయాన్ని ప్రజలు స్పష్టంచేస్తున్నారు.
అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గొట్టిపాటి రవికుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 నుంచి ఆయన ఈ నియోజకవర్గంలో వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. నిత్యం జనాలకు అందుబాటులో ఉంటారనే పేరుంది. 2014లో వైసీపీ నుంచి గెలిచినా అక్కడ ఇమడలేక తెలుగుదేశంలో చేరారు. 2019లో ఆ పార్టీ నుంచే గెలిచారు. ఈసారి ఆయనపై హనిమిరెడ్డిని వైసీపీపోటీలో ఉంచింది. ఇక్కడ వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న బాచిన కృష్ణచైతన్యను వైసీపీ తప్పించగా, ఆయన తెలుగుదేశంలో చేరిపోయారు. దీంతో హనిమిరెడ్డి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గొట్టిపాటి క్వారీ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపింది. వివిధ రకాల తనిఖీల పేరుతో వేధించింది. భారీగా జరిమానాలు విధించింది. మొత్తంగా ఆయన ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టింది. వీటన్నింటినీ గొట్టిపాటి ధీటుగా ఎదుర్కొని నిలబడ్డారు. మరోసారి గొట్టిపాటి గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. చీరాల నుంచి కరణం వెంకటేష్ వైకాపా అభ్యర్థిగా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం తరపున కొండయ్య యాదవ్ పోటీ చేస్తున్నారు. 2019లో తెలుగుదేశం నుంచి గెలిచిన కరణం బలరాం ఆ తర్వాత వైసీపీ చేరి అపప్రద మూటగట్టుకున్నారు. ఈసారి ఆయన కుమారుడికి వైసీపీ టికెట్ ఇప్పించుకున్నారు. చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ తరపున పోటీలో ఉండటం కీలకంగా మారింది. ఆయన కాంగ్రెస్‌లో చేరే వరకూ వైసీపీలో ఉండటంతో, ఆ పార్టీ ఓట్లే చీలుస్తారనే భయం అధికార పార్టీలో ఉంది. తెలుగుదేశం అభ్యర్థి కొండయ్య యాదవ్ నిత్యం జనాల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తాననే భరోసా కల్పిస్తున్నారు.
ఇతర రాష్ట్రాలకు వలస పోతున్న ఐటీ యువత - ఏన్డీఏ కూటమికి ఓటు వేసేందుకు ఆసక్తి? - ETV Bharat Prathidwani