Enumerators Facing Problems in Telangana : తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే సమస్యలతో కొనసాగుతోంది. ప్రజల వద్దకు వెళ్లిన ఎన్యూమరేటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమాచారం ఫారంలో నింపాల్సి ఉంది. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉండగా, తమకు అందుతున్న పథకాలు రద్దు అవుతాయేమోనన్న అనుమానంతో ప్రజలు సరైన సమాధానాలు చెప్పడంలేదు. దీనికి తోడు ఎన్యూమరేటర్లుగా ఉన్న టీచర్లు ఉదయం తమ విధులను చూసుకుని ఇళ్ల వద్దకు వెళ్తుండగా, ఆ సమయానికి ప్రజలు వ్యవసాయ క్షేత్రాలకు, ఇతర పనులకు వెళ్తున్నారు. ఫలితంగా ఇళ్లకు తాళం వేసి ఉంటున్నాయని, ఒక్కో ఇంటికి రెండు, మూడు సార్లు తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మీకెందుకు చెప్పాలి? : సర్వేలో మొత్తం 75 రకాల అంశాలపై వివరాలు సేకరించాల్సి ఉంది. ఇలా ఒక్కో కుటుంబానికి దాదాపు గంట టైమ్ పడుతోంది. అయితే ఉదయం పాఠశాల నిర్వహించి మధ్యాహ్నం సర్వేకు వెళ్లే ఉపాధ్యాయులకు పలు గ్రామాల్లో తాళాలతో ఇళ్లు దర్శనమిస్తున్నాయి.
ఇలా ఒక్కో ఇంటికి రెండు, మూడుసార్లు తిరుగుతున్నప్పటికీ సర్వే పూర్తి కావడం లేదని ఎన్యూమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ప్రజలు ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. మాకేమైనా పథకాలు ఇస్తారా, అసలు మీకెందుకు వివరాలు చెప్పాలంటున్నారు. ద్విచక్రవాహనాలు, ట్రాక్టర్లు, కార్లు ఉన్నా, అవి తమవికాదని పలువురు చెబుతున్నారు. ఇలా చాలా చోట్ల సర్వే సాఫీగా సాగడం లేదు. స్థిరాస్తులు వివరాలతో పాటు, టీవీ, రిఫ్రిజరేటర్, ద్విచక్రవాహనం, కారు, వాషింగ్ మిషన్ తదితర వివరాలను ఎన్యూమరేటర్లకు చెప్పడం లేదు.
"ఆ ఒక్కటీ తప్ప!" - ఇంటింటా అదే సమస్యతో సతమతం
సర్వేకోసం వెళ్తే కుక్కలను ఉసిగొల్పారు: కొన్ని ప్రాంతాల్లో కులం వివరాలు తెలిపే క్రమంలో ఉపకులం గురించి చెప్పట్లేదు. మరికొన్ని చోట్ల సొంతింట్లో ఉన్నప్పటికీ, అద్దె ఇల్లు అంటూ చెబుతున్నారు. ప్రజాపాలనలో చేసుకున్న అప్లికేషన్లకే ఎలాంటి మోక్షంలేదని, సర్వేలో ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలంలోని ఓ గ్రామంలో సర్వేకోసం వెళ్తే కుక్కలను ఉసిగొల్పారని ఓ ఎన్యూమరేటర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 - 175 ఇళ్లను కేటాయించారు.
27వ తేదీలోగా 100 శాతం పూర్తి: తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ఈనెల 9వ తేదీన ప్రారంభమైంది. ఈ సర్వే పూర్తిచేయడానికి ఈనెల 27వ తేదీ గడువు విధించింది ప్రభుత్వం. అయినప్పటికీ చాలా జిల్లాల్లో ఇప్పటి వరకు కేవలం 58.62% మాత్రమే సమగ్ర సర్వే పూర్తయ్యింది. మరో 10 రోజుల మాత్రమే ఉంది. దీంతో సర్వే వందశాతం పూర్తి అవుతుందో లేదోనన్న సందేహం వ్యక్తమవుతోంది.
సర్వే త్వరగా పూర్తిచేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ దేవసహాయం తెలిపారు. మధ్యాహ్నం వెళ్తే ఇళ్లకు తాళాలు వేసి ఉంటున్నాయని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎన్యూమరేటర్లుగా ఉన్న టీచర్లు పాఠశాల వేళలకంటే ముందుగానే కొన్ని ఇళ్లు సర్వే చేయాలని ఆదేశాలను జారీ చేస్తామని చెప్పారు. ఈనెల 27వ తేదీలోగా సర్వే 100 శాతం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.