EAPCET Counselling Started in Telangana 2024 : తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్‌లో ప్రవేశించేందుకు ఎప్‌సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేడు ప్రారంభమైంది. ఇంజినీరింగ్‌తో పాటు ఎంపీసీ నుంచి ఫార్మసీ కోర్సులకు వెళ్లే వారికి సీట్ల కేటాయింపు చేయనున్నారు. జులై 4 నుంచి 12 వరకు విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎప్పుడు హాజరవుతారో స్లాట్ బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. జులై 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని వారు సూచించారు.
జులై 19న తొలి విడత : సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకున్న వారు జులై 8 నుంచి 15 వరకు వారికి నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవాలి. వారికి జులై 19న తొలివిడత సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. ఇక జులై 26 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుంది. జులై 27 సర్టిఫికెట్ వెరిఫికేషన్, జులై 27 నుంచి 28 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వనున్నారు. జులై 31న రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేస్తారు.
ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 10 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి ఆగస్టు 13న ఆఖరి ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. కన్వీనర్ కోటా ఇంటర్నల్ స్లైడింగ్‌కు ఆగస్టు 21, 22 తేదీల్లో అవకాశం కల్పించి ఆగస్టు 26న సీట్లు కేటాయింపు పూర్తి చేయనున్నారు.
ఎప్‌సెట్ వెబ్‌సైట్‌లోనే ప్రవేశాల లింక్ : గతేడాది వరకు ఫలితాలు విడుదల చేసేందుకు, ప్రవేశాల కౌన్సెలింగ్‌కు వేర్వేరు వెబ్‌సైట్ ఉండేది. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యేవారు. ఈసారి ఎప్‌సెట్ వెబ్‌సైట్ (www.eapcet.tsche.ac.in) లోకి వెళ్లినా అక్కడే అడ్మిషన్‌పై క్లిక్ చేస్తే కౌన్సిలింగ్ వెబ్‌సైట్ (www.tseapcet.nic.in)లోకి వెళ్లొచ్చు.
ఇంకా జీవోలు జారీ కాలేదు : ఈసారి మల్లారెడ్డి గ్రూపులోని ఒక కళాశాలను మరో కాలేజీలో విలీనం చేశారు. బాచుపల్లిలోని గోకరాజు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఉన్న లీలావతి మహిళా ఇంజినీరింగ్ కళాశాలను కో-ఎడ్యుకేషన్‌గా మార్చేందుకు ఏఐసీటీఈ ఆమోదించింది. ఈ రెండు మార్పులపై విద్యాశాఖ బుధవారం రాత్రి వరకు జోవోలు జారీ చేయలేదు. తెలంగాణలో ఏ ఒక్క కాలేజీలకు కూడా ఇంకా అనుబంధ గుర్తింపు కేటాయించలేదు. ఈసారి కూడా ఆనవాయితీగా చివరి అంకంలో కళాశాలలకు అనుమతిలివ్వడంతోపాటు సీట్ల సంఖ్య ప్రకటించాల్సిన పరిస్థితి.