Electricity Consumption Increased in Telangana : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆ ప్రభావం విద్యుత్ వినియోగంపై పడుతోంది. ఏప్రిల్, మే నెల కంటే ముందుగానే రికార్డు స్థాయి వినియోగం నమోదైంది. మార్చి 8న రాష్ట్ర చరిత్రలోనే రోజువారీ వినియోగం రికార్డు స్థాయిలో 15 వేల 623 మెగావాట్లకు చేరింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఉక్కపోత నుంచి బయట పడేందుకు ప్రజలు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లను భారీగా వినియోగిస్తున్నారు. వ్యవసాయానికీ డిమాండ్ పెరగడం వినియోగం విస్తరించేందుకు కారణంగా అధికారులు చెబుతున్నారు.
రానున్న రోజుల్లో ఆ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు, రోజువారీ వినియోగం దాదాపు 16 వేల మెగా వాట్లు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వేసవిలో నెలకు కనీసం 50 నుంచి 60 మిలియన్ యూనిట్లను ఎక్స్ఛేంజ్ నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని, తక్కువ ధరకు విక్రయించే వారి నుంచే కొనుగోలు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఎండాకాలం మొదలైంది.. కరెంటుకు డిమాండ్ పెరిగింది..
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోనూ కరెంట్ వినియోగం పెరిగింది. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా కోతల్లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో డిమాండ్ ఎంత పెరిగినా తట్టకునేలా చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో కొత్తగా 1600 మెగా వాట్ల వినియోగం అందుబాటులోకి రావడం కలిసి వచ్చే అంశమని అధికారులు చెబుతున్నారు.
ఏదేమైనా సరాసరి విద్యుత్ వినియోగం గత ఏడాది, ఈ ఏడాదితో పోల్చితే రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది మార్చిలో 291.15 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఈ ఏడాది మార్చ్‌లో 298.63 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. టీఎస్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది మార్చిలో 181.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఈ ఏడాది మార్చిలో 192.77 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో గత ఏడాది మార్చిలో 57.04 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఈ ఏడాది మార్చిలో 68.99 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది.
'విద్యుత్ వినియోగం పెరుగుతోంది.. అయినా ఇబ్బందులు రానీయం'
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం.. రాష్ట్ర చరిత్రలో రెండోసారి