Electric Buses in Telangana 2024 : టీఎస్ఆర్టీసీ హైదరాబాద్‌లో కొత్తగా 25 ఎలక్ట్రిక్ బస్సులను(TSRTC Electric Buses Launch) అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసిజెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఉన్నతాధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
TSRTC Electric Buses in Hyderabad : ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు అందని దుర్భర పరిస్థితిని చూశామని అన్నారు. ఆర్టీసీని అమ్మే ప్రసక్తే లేదని, ప్రైవేటుపరం చేయబోమని స్పష్టం చేశారు. కార్యక్రమం అనంతరం డిప్యూటీ సీఎం, మంత్రులు కలిసి నూతనంగా ప్రారంభించిన బస్సులో సచివాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వయంగా బస్సును నడిపారు.
'ఫ్రీ బస్' పథకంతో ప్రభుత్వంపై పెను భారం.. ఒక్క రోజు బిల్ ఎంతో తెలుసా?
అద్దె ప్రాతిపదికన తీసుకున్న మొత్తం 500 ఆర్టీసీ బస్సులు ఆగస్టు నాటికి రానున్నాయి. ఇవన్నీ నాన్ ఏసీ బస్సులే కావడం విశేషం. ఈ బస్సులు పాత మెట్రో ఎక్స్‌ప్రెస్‌ల స్థానంలో వస్తున్న బస్సులకు అప్‌గ్రేడ్ అని గ్రేటర్ అధికారులు తెలిపారు. అయితే ఈ బస్సుల్లో కూడా మహిళలు ఆధార్ కార్డు చూపించి ఉచితంగా బస్సు ప్రయాణం(Free Travel for Women) చేయవచ్చని వెల్లడించారు. ఈ బస్సులు నగరంలోని అన్ని ప్రాంతాలకు నడుస్తాయని పేర్కొన్నారు. వీటి ఛార్జింగ్ కోసం బీహెచ్ఈఎల్, మియాపూర్, కంటోన్మెంట్, హెచ్‌సీయూ, రాణిగంజ్ డిపోల్లో 33 కేవీ పవర్ లైన్లు ఉన్నట్లు వివరించారు.
TSRTC New Buses 2024 : మరోవైపు టీఎస్ఆర్టీసీ సొంతంగా 565 కొత్త డీజిల్ బస్సులను సమకూర్చుకునే పనిలో ఉంది. ఇందులో 125 మెట్రో డీలక్స్ బస్సులు ఉన్నాయి. ఇవన్నీ జూన్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇంకా మిగిలిన 440 బస్సుల్లో 300 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా 140 ఆర్డినరీ బస్సులు ఉన్నాయి. వీటన్నింటిలో మహిళలకు ఉచితంగానే ప్రయాణం కల్పించనున్నట్లు టీఎస్ఆర్టీసీ(TSRTC) స్పష్టం చేసింది.
100 బస్సులు ప్రారంభించిన సీఎం : గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి 100 ఆర్టీసీ బస్సులను లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో 90 బస్సులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం కాగా, మిగిలిన 10 ఏసీ బస్సులు. వీటిని హైదరాబాద్ నుంచి శ్రీశైలం మార్గంలో నడుపుతున్నారు. ఆర్టీసీని అభివృద్ధి పథంలో నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ - పీఆర్సీ ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం