Elderly Woman Abandoned on Roadside in Gannavaram : వయో వృద్దులైన తల్లిదండ్రులను భారంగా భావిస్తున్నారు కొందరు మూర్ఖులు. చిన్నప్పటి నుంచి పెంచి, పెద్ద చేసిన వారిని అనాథలుగా రోడ్డుపై వదిలేసి పోతున్నారు. ఆరోగ్య సమస్యలున్నాయని తెలిసినా కనికరం లేకుండా వారిని కంటతడి పెట్టిస్తున్నారు. దగ్గరుండి చూసుకోవాల్సిన వారే ఇలా తల్లిదండ్రుల పట్ల కర్కషంగా వ్యవహరిస్తున్న తీరు కలచివేస్తోంది.
నవ మాసాలు మోసి, కని, పెంచిన అమ్మే వారికి బరువైంది. వృద్ధురాలని కూడా చూడకుండా కారులో తీసుకొచ్చి రోడ్డుపై వదిలేశారు. తీవ్రమైన చలిలో ఈ తల్లి వణికిపోతున్నా వారు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. గన్నవరం పట్టణ శివారులో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. స్థానిక హైవేను ఆనుకొని ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలోని ఆల్ఫా హోటల్ వద్దకు అర్ధరాత్రి సమయంలో కారులో కొందరు వ్యక్తులు వచ్చారు. కారులో తమ వెంట తీసుకొచ్చిన సుమారు 80 ఏళ్ల వృద్ధురాలిని అక్కడ దించేసి కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు. చలికి వణికిపోతున్న ఆమెను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అర్ధరాత్రి ఆటోలో తీసుకొచ్చి వదిలేశారు - రాత్రంతా ఎముకలు కొరికే చలిలో వృద్ధుడు
పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీశారు. మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆమెను బీకేఆర్ వృద్ధాశ్రమంలో చేర్చారు. వృద్ధురాలి వద్ద లభ్యమైన ఆధార్ ఆధారంగా కొండపావులూరుకు చెందిన నక్కా లక్ష్మీకాంతంగా గుర్తించారు. కుటుంబ సభ్యులను పిలిపించిన పోలీసులు అర్ధరాత్రి ఎవరు వదిలేశారు? ఎందుకు వదిలేయాల్సి వచ్చిందన్న కోణంలో పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఆదివారం రాత్రి వరకు ఆమె వృద్ధాశ్రమంలోనే ఉన్నారు. సకాలంలో స్పందించిన పోలీసులు, ఆశ్రమ నిర్వాహకురాలు కానూరు శేషుమాధవిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు.
మేకలతో వెళ్లి అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు - వారం రోజులు ఎలా గడిపిందంటే!