Media Mogul Ramoji Rao Smruthi Vanam in Ramoji Film City : ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంలో ఆయన ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విషమంగా ఉండడంతో శనివారం ఉదయం 4.50 గం.కు ఆయన కన్నుమూశారు. రామోజీరావు అంత్యక్రియలను నేడు(ఆదివారం) నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఉదయం 9 నుంచి 10 మధ్య అంత్యక్రియలు జరపనున్నారు. ఆదివారం, సోమవారం రెండు రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు శుక్రవారం రాత్రే దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అక్కడి నుంచే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి ఆదేశాలు జారీ చేశారు. రామోజీరావు కుటుంబ సభ్యులతో సీఎం ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి, ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి శనివారం పరిశీలించారు. పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని సీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల ఎల్‌ఈడీ తెరల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులకు పోలీసులు సూచించారు.