ED Raids on Minister Ponguleti : రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో, ఆయన బంధువుల ఇళ్లలో ఈడీ సోదాలు కలకలం రేపాయి. లగ్జరీ వాచ్‌ల కొనుగోలు కోసం క్రిప్టో, హావాలా మార్గంలో లావాదేవీలు జరిపారనే అభియోగంతో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 5న సింగపూర్ నుంచి ఖరీదైన వాచ్‌లు తెప్పించారని, ఇందుకు సుంకం చెల్లించలేదని, చెన్నై కస్టమ్స్ అధికారులు అతని కుమారుడు హర్షారెడ్డికి నోటీసులు జారీ చేశారు. సింగపూర్ నుంచి చెన్నై పోర్టుకు వాచ్‌లు వచ్చినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
అలోకం నవీన్ కుమార్ మధ్యవర్తిగా సింగపూర్‌కి చెందిన ఫహెర్దీన్ ముబీన్ నుంచి హర్షరెడ్డి వాచ్‌లు కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ గుర్తించింది. విచారణలో అలోకం నవీన్ కుమార్ రూ. 100 కోట్ల స్మగ్లింగ్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దీనిపై ఇటీవల చెన్నై కస్టమ్స్ అధికారులు హైదరాబాద్, ఖమ్మంలో సోదాలు చేసింది. ఈ వ్యవహారంపై మరో కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేస్తోంది.
మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా నగరంలో మొత్తం 5 చోట్ల ఉదయం నుంచి సోదాలు చేపట్టింది. ఉదయం 5గంటల నుంచి మంత్రి పొంగులేటి నివాసం, అతని ఫామ్‌హౌస్, జూబ్లీహిల్స్‌లోని కుమార్తె నివాసం, కార్యాలయాలు సహా మొత్తం 5 చోట్ల ఏక కాలంలో ఈడీ సోదాలు చేస్తోంది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది భద్రతతో సోదాలు కొనసాగుతున్నాయి.
సోదాలపై కాంగ్రెస్ విమర్శులు : మరోవైపు ఈడీ సోదాలపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ చేస్తున్న కుట్రలో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటిపై ఈడీ దాడులు చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నాయకులను భయపెట్టడానికి, మానసిక స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి చేస్తున్న కుట్రని ఆయన విమర్శించారు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కూడా భయపెట్టడానికి నిరంతరం ఈడీ దాడులు చేస్తున్నారని తెలిపారు.
కర్ణాటకలో డీకే శివకుమార్‌పై కూడా దాడి జరిగిందని తెలిపారు. దీని వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమి లేదని, బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఎలాంటి చెడ్డ పేరు లేకుండా మంచి వ్యాపారవేత్తగా పేరున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై దాడులను తీవ్రంగా ఖండించారు. అన్ని రాష్ట్రాలలో ఆర్థికంగా బలపడిన కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులపై దాడులు జరుగుతున్నాయని, ఇది బీజేపీ మార్క్ రాజకీయానికి పరాకాష్ట అని విమర్శించారు.