BRS MLC Kavitha Arrested in Delhi Liquor Scam Case : సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద శుక్రవారం సాయంత్రం 5:20 గంటలకు అరెస్ట్ చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ ప్రకటించారు. దిల్లీ నుంచి మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్న 12 మంది సభ్యుల ఈడీ బృందం సుమారు 4 గంటలపాటు ఇంట్లోనే ఉన్నారు.
MLC Kavitha Arrest Updates : కవిత (MLC Kavitha Arrest) ఇంట్లోకి రాగానే ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ చూపించి సోదాలు నిర్వహించారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. సాయంత్రం 5:20 గంటలకు అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీల నివేదిక ఇచ్చారు. మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 3 కింద కవిత నేరానికి పాల్పడ్డారని తెలిపారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు తగిన ఆధారాలున్నాయని నోటీసుల్లో పేర్కొన్నారు. కవిత నుంచి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ సమాచారాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి కూడా ఇచ్చారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసు - బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు
ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం: ఈడీ అధికారులు నిర్వహించిన పంచనామాలో పరోక్షంగా కేటీఆర్‌పై ఆరోపణలు చేశారు. సాయంత్రం 6:00 గంటల సమయంలో నిందితురాలి సోదరుడినని, లాయర్లమని చెబుతూ దాదాపు 20 మంది బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. తమ విధులకు ఆటంకం కలిగించారని అనిపంచనామాలో పేర్కొన్నారు. కవిత అరెస్టు సమాచారం తెలియగానే సాయంత్రం ఆరు గంటల సమయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు ఆమె నివాసం వద్దకు చేరుకున్నారు. గేటు వేసి ఉండటంతో చాలాసేపు వారు బయటే ఉన్నారు.
ఈ సమయం పోలీసులతో బీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణకు దిగాయి. తర్వాత వారిని లోనికి అనుమతించారు. ఈడీ అధికారులతో కేటీఆర్ (KTR) వాగ్వాదానికి దిగారు. అరెస్ట్ చేయబోమంటూ సుప్రీంకోర్టులో అండర్‌టేకింగ్ ఇచ్చి ఇప్పుడెలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. మాట తప్పుతున్నందున కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియా మీనాకు ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొంత గొడవ చోటు చేసుకుంది.
ED Arrested BRS MLC Kavitha : కవితను తరలిస్తున్న సమయంలో అక్కడ భావోద్వేగాలు పెల్లుబికాయి. మెట్లు దిగి వస్తూ ఆమె తన కుమారుడిని హత్తుకున్నారు. భర్త అనిల్ ఆమెను ఓదార్చారు. కేటీఆర్, హరీశ్‌రావు, కుటుంబసభ్యులు, పార్టీ నేతలు కవితకు ధైర్యం చెప్పారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కవిత అక్కడ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్న అభిమానులకు చేయి ఊపుతూ కారులో వెళ్లిపోయారు.
కవితను దిల్లీ తరలించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్ నుంచి దిల్లీ వెళ్లే విమానంలో ముందుగానే సీట్లు బుక్ చేసుకున్నారు. ఆమెను విమానాశ్రయానికి తరలించేందుకు బంజారాహిల్స్ పోలీసులు వాహనాన్ని తీసుకురాగా కవిత తన వాహనంలోనే వస్తానని చెప్పడంతో ఈడీ అధికారులు అంగీకరించారు. విమానంలో న్యాయవాది మోహిత్ రావుతో కలిసి దిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
ఇవాళ కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం : అక్కడ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఇవాళ కూడా మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కవితను ఉదయం 10:30 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరు పరిచే అవకాశం ఉంది. కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు తదుపరి కార్యాచరణను చేపట్టనున్నారు.
'కేసు కోర్టులో ఉన్నా పదేపదే సమన్లా?'- ఈడీ విచారణకు కేజ్రీవాల్ ఏడోసారి దూరం
అసలేం జరిగింది : దిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో గత ఏడాది మూడు రోజుల పాటు ఈడీ ప్రశ్నించింది. గత ఏడాది మార్చి 11, 20, 21వ తేదీల్లో మూడు రోజుల పాటు సుమారు 27 గంటల పాటు కవితపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈడీ సమన్లపై గత ఏడాది మార్చి 15న సుప్రీంకోర్టును ఎమ్మెల్సీ కవిత ఆశ్రయించారు. సీఆర్‌పీసీ సెక్షన్ 160 ప్రకారం మహిళలను వారి ఇంటి వద్దే విచారించాలని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని కవిత సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను అంతకుముందు దాఖలైన నళినీ చిదంబరం, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ కేసులకు సర్వోన్నత న్యాయస్థానం జతచేసింది. కవిత పిటిషన్‌పై గత ఏడాది సెప్టెంబరు 15న జరిగిన విచారణలో పది రోజులు సమన్లు జారీ చేయడం వాయిదా వేస్తామని అన్నారు.
ఆ రోజు జరిగిన విచారణలో వచ్చే 10 రోజులు సమన్లు జారీ చేయబోమని ఈడీ తరఫున సుప్రీంకోర్టుకు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు తెలిపారు. ఆ తర్వాత కవితకు సమన్లు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టులో ఆమె తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. కవిత న్యాయవాదుల వాదనలను అదనపు సొలిసిటర్ జనరల్ కొట్టిపారేశారు. తాను ఒక్కసారికే సమన్లు జారీ చేయం అని చెప్పాము తప్పా, ప్రతిసారి అది వర్తించదని ఆయన స్పష్టం చేశారు. ఒక్కసారి కోసం చెప్పిన మాటను అన్ని సందర్భాల్లో వర్తింప జేసుకోవడం సబబు కాదని ఎస్‌వీ రాజు అప్పుడే చెప్పారు. గతేడాది సెప్టెంబరు 15న జరిగిన విచారణలో ఈడీ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ చెప్పిన విషయాన్ని నమోదు చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ ధర్మాసనం పేర్కొంది.