2024 Andhra Pradesh Elections : ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనను అదుపు చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై ఈసీ తీవ్రంగా స్పందించింది. బాధ్యులైన అధికారులపై ఇప్పటికే వేటు వేసిన ఈసీ వారి స్థానంలో కొత్తని నియమిస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
కొత్త వారిని నియమిస్తూ ఉత్తర్వులు : ఎన్నికల హింస ఘటనల్లో బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తూ సీఈవో ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకూ మెుత్తం డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్‌స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ సీఈవో నిర్ణయం తీసుకుంది. నరసరావుపేట డీఎస్పీగా ఎం. సుధాకర్‌రావు, గురజాల డీఎస్పీగా సి.హెచ్. శ్రీనివాసరావు తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్‌నాయుడు, తిరుపతి స్పెషల్ బ్రాంచ్‌కు ఎం. వెంకటాద్రిని నియమిస్తూ సీఈవో తాజాగా ఉత్తర్వులు వెలువరించింది.
విశాఖలో మీడియాపై కేసులు- 'బాధిత కుటుంబానికి అండగా నిలిచినందుకే' - Police Cases against media
హింసపై నివేదిక సిద్ధం చేసిన సిట్ : ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో కేసుల విచారణ ప్రారంభించింది. పల్నాడు జిల్లా మాచర్ల, నర్సరావుపేట, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రి తదితర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై ప్రాథమిక నివేదికను సిట్ సిద్ధం చేసింది. ఘటనపై వివరాలు సేకరించేందుకు, మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఈ బృందం పర్యటించింది. నేతలు, స్థానికులు, పోలీసులను అధికారులు విచారించారు.
ఇదీ జరిగింది: రాష్ట్రంలో పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేపట్టింది. పల్నాడు జిల్లా మాచర్ల, తిరుపతి జిల్లా చంద్రగిరి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో అధికార వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ఎత్తున దాడులకు పాల్పడ్డాయి. మారణాయుధాలతో స్వైర విహారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి. ఈ అల్లర్లలో ఇప్పటికే పలువురు అధికారులు, పోలీసుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వెల్లువెత్తగా కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు పలువురు పోలీస్ ఉన్నతాధికారులపై వేటు వేసింది. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఎన్నికలకు ముందు, తర్వాత ఏపీలోని పలు ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై ఇటీవల 13 మందితో సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది.
రాష్ట్రంలో అల్లర్లపై సిట్ దర్యాప్తు షురూ- అధికార పార్టీ నేతల్లో వణుకు - SIT investigation