Dwaraka Tirumala Rao Take Charge DGP in AP : ఏపీ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆయన హరీశ్‌కుమార్ గుప్తా నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఐపీఎస్ అధికారులకు ద్వారకా తిరుమలరావుకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు పోలీసుల గౌరవందనం స్వీకరించి, ఉదయం 7:50 గంటలకు డీజీపీగా సంతకం చేశారు.
AP New DGP Dwaraka Tirumala Rao : 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. మొట్టమొదటిగా కర్నూలు ఏఎస్పీగా పోస్టింగ్ చేపట్టారు. ఆ తర్వాత ఆయన కామారెడ్డి, ధర్మవరంలో ఏఎస్పీగా పనిచేశారు. నిజామాబాద్ జిల్లా ఆపరేషన్స్ విభాగం అదనపు ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్పీగా పదోన్నతి పొందాక, అనంతపురం, కడప, మెదక్ జిల్లాలతో పాటు విజయవాడ రైల్వే, సీఐడీ, సీబీఐ విభాగాల్లో విధులు నిర్వహించారు.
అనంతపురం, హైదరాబాద్ రేంజ్‌లతో పాటు ఎస్‌ఐబీలో డీఐజీగా ద్వారకా తిరుమలరావు విధులు నిర్వహించారు. ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ విభాగాల్లో ఐజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా, రాష్ట్ర విభజన తర్వాత విజయవాడ నగర పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. 2021 జూన్ నుంచి ఆర్టీసీ ఎండీగా ఉన్నారు. తిరుమలరావుకు నిక్కచ్చిగా వ్యవహరించే సమర్థ అధికారిగా పోలీసు శాఖలో గుర్తింపు ఉంది. తాజాగా ఆయన ఇవాళ బాధ్యతలు చేపట్టారు.
నెలన్నర పాటు డీజీపీగా కొనసాగిన హరీష్‌గుప్తా : వైసీపీతో అంటకాగుతున్నారన్న ఫిర్యాదులపై సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవీ రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసిన ఈసీ, హరీశ్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమించిన విషయం తెలిసిందే. మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన ఆయన దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు.
ఏపీ ఏజీగా దమ్మాలపాటి శ్రీనివాస్ బాధ్యతలు - Dammalapati Srinivas Take Charge AG