Dussehra Celebration Held Grandly in AP: రాష్ట్రవ్యాప్తంగా దసరా మహోత్సవాలు సందడిగా సాగుతున్నాయి. ఉదయం నుంచే ఆలయాలకు క్యూ కడుతున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి అనుగ్రహం పొందుతున్నారు. భక్తుల తాకిడితో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతోంది. పలుచోట్ల కరెన్సీ నోట్లతో అమ్మవారికి చేసిన అలంకరణలు ఆకట్టుకుంటున్నాయి.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. 6వ రోజున దుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే భారీగా తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తజనంతో కిటకిటలాడుతోంది. మరోవైపు దుర్గమ్మకు కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానం, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్, కాణిపాకం ఆలయ ఈవో గురుప్రసాద్, అన్నవరం దేవస్థానం ఈవో నాగచంద్రమోహన్ ఆయా ఆలయాల వేదపండితులతో కలిసి వచ్చి అమ్మవారికి చీర, సారె, ఇతర సుమంగళ ద్రవ్యాలు సమర్పించారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మీ అలంకరణలో భక్తులను అనుగ్రహించారు. రూ.3 కోట్ల 33 లక్షల కరెన్సీ నోట్లను దండలుగా కూర్చి అమ్మవారికి అలంకరణ చేశారు. ముమ్మిడివరం గోదశివారిపాలెంలో రూ.25 లక్షలు, పళ్లవారిపాలెంలో రూ.5లక్షలతో అమ్మవారిని, గర్భాలయాన్ని అలంకరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వీరుళ్లమ్మ త్రిశక్తి పీఠం వద్ద మహాలక్ష్మీ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారిని రూ.5 లక్షలతో అలంకరించారు.
14 నుంచి 20 వరకు 'పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు' - పవన్ ఆదేశాలు
రూ.2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరణ: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని శ్రీ గంగానమ్మ అమ్మవారు మహాలక్ష్మీ రూపంలో భక్తులను కటాక్షిస్తున్నారు. గ్రామస్థులు, భక్తుల సహకారంతో ఆలయ కమిటీ అమ్మవారిని రూ.2 కోట్ల 20 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించింది. ఏలూరు జిల్లా నిడమర్రు మండలం మందలపర్రులోని శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలోని అమ్మవారు ధనలక్ష్మీ రూపంలో అనుగ్రహిస్తున్నారు. సుమారు కోటి రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ చేశారు.
గ్రామస్థులు, భక్తుల విరాళాలతో 1500 కిలోల శారీ, 11 రకాల పిండివంటలతో 500 మంది మహిళలు ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు. దాతల సాయంతో రూ.42 లక్షల విలువైన బంగారు కిరీటాన్ని తయారు చేయించి అమ్మవారికి అలంకరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని కనకదుర్గమ్మ మహాలక్ష్మి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారికి ఇష్టమైన కలువ పూలను సమర్పించి భక్తులు పూజలు చేశారు.
దుర్గమ్మ విగ్రహం వద్ద సామూహిక పూజలు: కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లేశ్వరం కోదండ రామాయలయంలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ విగ్రహం వద్ద మహిళలు సామూహిక కుంకుమ పూజలు చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరులోని వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలోని అమ్మవారు ధనలక్ష్మీ రూపంలో దర్శనమిచ్చారు. రూ.50 లక్షల విలువైన నోట్లతో అమ్మవారికి అలంకరణ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని శ్రీ జగదీశ్వరీ ఆలయంలో అమ్మవారిని 5 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు. అష్టలక్ష్మీ హోమం, చండీ హోమం నిర్వహించారు.
"బరి తెగించారు" ఆన్లైన్లో అటవీ జంతువులు అమ్మకం - ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులో బేరాలు
"రూ.2.3కోట్ల కట్టలు, నాణేల కుప్పలు" - భారీగా తరలివచ్చిన భక్తులు