AP DGP Transfer 2 DSPs : గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్సీపీ అరాచకాలకు కొమ్ముకాశారనే ఫిర్యాదులు ఉన్న రాజంపేట, తుళ్లూరు డివిజన్ల డీఎస్పీలు వీఎన్‌కే చైతన్య (VNK Chaitanya), ఇ. అశోక్‌కుమార్ గౌడ్ (E.Ashokkumar Goud)లపై రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఇద్దరికీ ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు డీజీపీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
చైతన్యపై 23 ప్రైవేటు కేసులు దాఖలు : వీఎన్‌కే చైతన్య అత్యంత వివాదాస్పద అధికారి. అనంతపురం జిల్లా తాడిపత్రి డీఎస్పీగా చేసినప్పుడు నాటి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పిందే చట్టమన్నట్టుగా వ్యవహరించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై భౌతికదాడులకు దిగారని విమర్శలు వచ్చాయి. తాడిపత్రిలో బాధితులు చైతన్యపై 23 ప్రైవేటు కేసులు దాఖలు చేశారు. రాజంపేటకు బదిలీపై వెళ్లి, అక్కడా అదే అరాచకాలు కొనసాగించారు. అర్ధరాత్రి వేళ తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసంలోకి చొరబడి ఆ పార్టీ కార్యకర్తలపై లాఠీలతో దాడి చేశారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. జేసీ ఇంట్లో పని చేసే దళితుడు, దివ్యాంగుడైన కిరణ్ కుమార్‌ను ఇష్టానుసారం కొట్టారు.
దాచినా దాగని అరాచకాలెన్నో!- డీఎస్పీ చైతన్య అకృత్యాలపై చర్యలేవీ? - Allegations on DSP VNK Chaitanya
వైఎస్సార్సీపీకి కొమ్ముకాసిన అశోక్ కుమార్ గౌడ్ : అశోక్ కుమార్ గౌడ్ నూజివీడు డీఎస్పీగా పని చేసిన సమయంలో వైఎస్సార్సీపీకి కొమ్ముకాశారనే ఫిర్యాదులున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తీవ్రంగా వేధించారు. ఆయన్ను బహిరంగంగా హెచ్చరించారు. ఎన్నికలకు కొద్ది రోజులు ముందు అశోక్ కుమార్ గౌడ్ తుళ్లూరు డీఎస్పీగా నియమితులు అయ్యారు. ఎన్డీఏ విజయం సాధించిన నేపథ్యంలో మందడంలో అమరావతి రైతులు బాణాసంచా కాల్చగా వారి పట్ల అశోక్ కుమార్ గౌడ్ దురుసుగా ప్రవర్తించారన్న ఫిర్యాదులున్నాయి.
వైఎస్సార్సీపీ కనుసన్నల్లో అరాచక 'చైతన్యం' - DSP Chaitanya Violence
టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు - ఎస్ఐలు సస్పెండ్ : గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి ఘటన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులపై గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాటి సస్పెన్షన్ వేటు వేశారు. కేసు దర్యాప్తులో అనేక లోపాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విచారణలో అలసత్వం ప్రదర్శించిన అప్పటి మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించిన ఎస్ఐలు లోకేశ్, క్రాంతి కిరణ్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే ఎస్ఐలు విజయ కుమార్ రెడ్డి, రమేష్‌పైన శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. సీఐ భూషణం మీద సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.