Drinking Water Problem in Gudivada: మంచినీరు అందించేందుకు అధికారపక్షం చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్యం కారణంగా కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ వాసులు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారు. గుడివాడ ప్రజలకు మంచినీరు అందించేందుకు గతంలో పట్టణంలో 63 ఎకరాల విస్తీర్ణంలో ఒక చెరువు, 105 ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా మరొక మంచినీటి చెరువును నిర్మాణం చేశారు.
ఎప్పుడు గండి పడుతుందో తెలియని పరిస్థితి: పాత చెరువుకు గండి పడి మూడు సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు దానిని పూడ్చలేదు. కొత్త చెరువు కట్ట సైతం బలహీనంగా ఉండటంతో నీటితో నింపితే ఎప్పుడు గండి పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రెండు చెరువులను కూడా నీటితో నింపకుండా అధికారులు వదిలేశారు. దీంతో చెరువుల్లో నీరు మట్టానికి తగ్గిపోయింది.
మూడేళ్ల క్రితం గండిపడితే ఇప్పటికీ అలాగే: గుడివాడ పట్టణం పెదఎరుకపాడులో 63 ఎకరాల్లో ఉన్న పాత చెరువుకు మూడేళ్ల క్రితం గండిపడితే అప్పటి నుంచి దానిని పూడ్చలేదు. ఆ పక్కనే 105 ఎకరాల్లో ఉన్న కొత్త మంచినీటి చెరువుకి కూడా గండిపడే అవకాశం ఉండటంలో రెండు చెరువుల్లో కూడా అధికారులు నీటిని నిల్వ చేయడం లేదు. దీంతో రెండు చెరువుల్లో కూడా నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది.
గుక్కెడు మంచినీళ్లివ్వండి మహాప్రభో - కోన గ్రామస్థుల ఆవేదన - WATER PROBLEM IN KONA
మరో రెండు నెలలు ఎలా గడుస్తాయో: నిర్వహణ లోపంతో చెరువుల గట్లు చిట్టడవిని తలపిస్తున్నాయి. గుడివాడలో ఇప్పటికే రోజు విడిచి రోజు మంచినీటిని విడుదల చేస్తున్నారు. అది కూడా 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు మాత్రమే ఇస్తున్నారు. దీని కారణంగా ప్రజలు అధిక డబ్బులు వెచ్చించి మినరల్ వాటర్ క్యాన్లపై ఆధారపడుతున్నారు. వేసవి తీవ్రత పెరిగితే ఇంకా నీళ్లు ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఈ రెండు చెరువుల నిర్వహణకు, పంప్ హౌస్ల మరమ్మతులకు ప్రతి సంవత్సరం మున్సిపల్ అధికారులు దాదాపు కోటి రుపాయలకు పైగా నిధులు కేటాయిస్తారు.
ఏటా కేటాయిస్తున్న ఆ నిధులు ఏమవుతున్నాయి?: చెరువు మరమ్మతులకు ఏటా కోటి రూపాయలు నిధులు విడుదల చేస్తున్నా, రెండు చెరువులు మాత్రం మరమ్మతులకు నోచుకోవడం లేదు. దీంతో చెరువు మరమ్మతులకు కేటాయిస్తున్న నిధులు ఏమవుతున్నయా అనే అనుమానాలు సైతం ప్రజలలో కలుగుతున్నాయి. రెండు చెరువుల్లోనూ నీరు నింపకుండా అధికారులు గాలికి వదిలేశారు. అధికారులు చెరువుల్లో నీటిని నింపే పరిస్థితి లేకపోవడంతో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి గుడివాడ పట్టణ వాసులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.
నీటి కటకట - గత్యంతరం లేక మురికినీళ్లే తాగుతున్న కోడూరు వాసులు - Water Crisis in Kodur