Drinking Water Problem Bhimavaram in West Godavari : భీమవరం శరవేగంగా విస్తరిస్తున్నా సమీప ప్రాంతాలు మాత్రం మౌలిక సదుపాయాలకు నోచుకోవట్లేదు. పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే కాలనీలకు నేటికీ నీటి సమస్య వెంటాడుతోంది. తాగునీరు లేక జనాల గొంతులు ఎండుతున్నాయి. కుళాయిలు లేక దశాబ్దాలుగా ట్యాంకర్ నీళ్లే వీరికి ఆధారం. వారానికి ఒకసారో, రెండు సార్లో వచ్చే నీటి కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. డ్రమ్ముల్లో నీటిని నింపుకుని పొదుపుగా వాడుకుంటున్నారు.
Drinking Water Crisis : భీమవరంలో ఏ వీధిలో చూసినా ఏ ఇంటి ముందు చూసినా పదుల సంఖ్యలో నీళ్ల డ్రమ్ములే. మరోవైపు కాలువల్లో వంటపాత్రలు కడుగుతూ బట్టలు ఉతుకుతూ నానా అవస్థలు పడుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి కూతవేటు దూరంలో ఉన్న ప్రకాష్ నగర్, పవిత్ర నగర్ కాలనీవాసుల కష్టాలు. ఏళ్ల తరబడి ఇక్కడ నివాసం ఉంటున్నా రక్షిత మంచినీటి సరఫరా మాటేలేదు. కనీస అవసరాల కోసం పంట కాలువపై ఆధారపడాల్సిందే. అవి కూడా పరిశుభ్రంగా ఉండవు. మంచినీటి కుళాయి కనెక్షన్లు లేకపోవడంతో పురపాలక సంస్థ సరఫరా చేసే ట్యాంకర్ల నీటి కోసం స్థానికులు పడిగాపులు కాస్తున్నారు. డ్రమ్ములు కొనుక్కుని వాటిలో నీటిని నింపి నిల్వ చేసుకుంటున్నారు.
People Suffering Water Problem : ట్యాంకర్ వస్తేనే ప్రజల నీటి అవసరాలు తీరతాయి. ట్యాంకర్ రాకపోయినా, సరిపడా నీళ్లు నింపుకోకపోయినా బిందెలు పట్టుకుని ఇతర ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సిందే. ఇంటి పన్ను కట్టిన వారికి సైతం కుళాయి కనెక్షన్లు ఇవ్వలేదు. అమృత్ పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులతో 2021లోనే బీసీ కాలనీలో మంచినీటి ట్యాంక్ నిర్మాణం ప్రారంభించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు ఇవ్వాల్సిన వాటా అంటూ ఆలస్యమైంది. నాలుగేళ్లు తాత్సారం చేసిన అధికారులు కొన్ని రోజుల క్రితమే ట్యాంక్ నిర్మాణం పూర్తిచేశారు. అయినా ఇప్పటికీ పైపు లైన్లు, ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు.
వాంబే కాలనీ వాసుల వ్యధ - ఈ నీరు తాగేదెలా? - Drinking Water Problem
కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా ప్రజలకు కలగానే మిగిలిపోయింది. ఓట్ల కోసం వచ్చే నాయకులకు మాత్రం కాలనీవాసుల గోడు వినిపించట్లేదు. ఎన్నికల సమయంలో అది చేస్తాం, ఇది చేస్తామంటూ హామీలు గుమ్మరించడం గెలిచిన తర్వాత మర్చిపోవడం షరా మామూలైపోయింది.