Dr Gullapalli Nageswara Rao on Corneal Blindness : కంటికి తగిన గాయాలను నిర్లక్ష్యం చేయడం వల్లే కార్నియా ఇన్ఫెక్షన్లు, తద్వారా అంధత్వం పెరుగుతున్నాయని ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపక ఛైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు తెలిపారు. దేశం నుంచి కార్నియా అంధత్వ సమస్యను పారదోలడమే వారి ముందున్న లక్ష్యమని ఆయన అన్నారు. ఎల్వీపీఈఐ ఆధ్వర్యంలో ఇప్పటివరకూ 50 వేలకు పైగా కార్నియా మార్పిడి చికిత్సలు చేశామని వెల్లడించారు. ఇది ప్రపంచ రికార్డని చెప్పారు. ఈ సందర్భంగా గురువారం డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రశాంత్గార్గ్, సంస్థలో భాగమైన శాంతిలాల్ సంఘ్వీ కార్నియా ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ప్రవీణ్ వడ్లవల్లి మీడియా సమావేశం నిర్వహించారు.
కార్నియాల సేకరణలో మూడో స్థానం : గత 35 ఏళ్లలో 1.2 లక్షల కార్నియాలను సేకరించామని డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు అన్నారు. ఈ విషయంలో ఆసియాలో తొలి స్థానంలో, ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నామని వెల్లడించారు. 50 వేలకు పైగా కార్నియాల మార్పిడి చేసి ప్రపంచంలో తొలిస్థానం సాధించడం గర్వకారణమని చెప్పారు. ఎల్వీపీఈఐలో మార్పిడితో పాటు అవసరమైన ఆసుపత్రులకు కార్నియాలు అందిస్తున్నామని వివరించారు. 43.72 శాతం మార్పిడి చికిత్సలు ఉచితంగా చేశామన్నారు. కార్నియా మార్పిడి రోగుల సరాసరి వయసు 45 ఏళ్లుగా ఉందని, పురుషులతో పోల్చితే మహిళల్లో అంధత్వ సమస్యలు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉన్నాయని వెల్లడించారు.
కంటికి దెబ్బ తగిలి ఎర్రబడితే పాలు పోయొద్దు : కంటికి దెబ్బ తగిలి ఎర్రబడితే గ్రామీణ ప్రాంతాల్లో పాలు పోస్తారని, ఇలా పోయొద్దని డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు చెప్పారు. ఇలా కంటికి తగిన దెబ్బలతోనే ఎక్కువ శాతం కార్నియాకు నష్టం జరుగుతోందన్నారు. కంటికి దెబ్బ తగిలిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. 5 నుంచి 7 శాతం కార్నియా సమస్యలకు మేనరిక వివాహాలు చేసుకోవడమే కారణం. పరిశ్రమలు, కాలుష్యం, జాగ్రత్తలు లేకుండా టపాసులు కాల్చడం, కాటరాక్ట్ సర్జరీలో లోపాలు కారణంగా కూడా కార్నియా దెబ్బతింటుంది. గ్రామీణ ప్రాంతాల్లో విజన్ సెంటర్ల ద్వారా ప్రజల్లో నేత్ర సమస్యలను గుర్తిస్తున్నామన్నారు. వారికి టెలిమెడిసిన్ ద్వారా ఇక్కడి నుంచి సూచనలు, సలహాలు అందిస్తున్నామన్నారు. ఈ సేవలను మారుమూల పల్లెలకు భవిష్యత్తులో విస్తరించే యోచనలో ఉన్నామని వివరించారు.
వచ్చే 3 ఏళ్లలో కృత్రిమ కార్నియా : 3డీ టెక్నాలజీతో ల్యాబ్లో కృత్రిమ కార్నియాను అభివృద్ధి చేశామన్నారు. క్లినికల్ ట్రయల్స్ అనంతరం రోగులకు ఉపయోగించేందుకు మరో మూడేళ్లు పట్టే అవకాశం ఉందని వివరించారు. ప్రస్తుతం కార్నియా కావాలంటే దేశవ్యాప్తంగా 6 నెలలపాటు నిరీక్షణ జాబితా ఉందన్నారు. కానీ ఎల్వీపీఈఐలో 24 గంటల్లోనే సరఫరా చేస్తామన్నారు. అత్యంత నాణ్యతతో కూడిన బ్యాంకులో వీటిని భద్రపరుస్తామని తెలిపారు. మార్పిడిలో రకరకాల మోడళ్లను మిషన్ లెర్నింగ్లో వాడి ఏఐ సాంకేతికతను అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. ఏఐతో పిల్లలు, పెద్దల్లో 2-3 ఏళ్ల ముందే మయోపియా సమస్యను గుర్తించవచ్చని చెప్పుకొచ్చారు. (మయోపియా అంటే దూరంలోని వస్తువులను స్పష్టంగా చూడలేకపోవడం)