Donors Continue to Donate CM Relief Fund : విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి దాతల విరాళాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును హైదరాబాద్‌లో కలిసి పలువురు చెక్కులు అందించారు. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డిలు 5 కోట్ల రూపాయలను అందించారు. అలాగే కాంటినెంటల్ కాఫీ తరఫున చల్లా శ్రీశాంత్ 1 కోటి 11 లక్షలు, చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరఫున చల్లా అజిత 1 కోటి రూపాయల విరాళం ఇచ్చారు.
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యం 1 కోటి 50 లక్షలు, ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్ వేములపల్లి 1 కోటి రూపాయల చెక్కులను చంద్రబాబుకు అందించారు. లారస్ ల్యాబ్స్ ఫౌండర్, సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, నాగరాణి చావ 1 కోటి, చలసాని చాముండేశ్వరి, శ్రీరామ్ 25 లక్షలు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ 2 లక్షలు, నరసింహారావు 2 లక్షల రూపాయల విరాళల చెక్‌లను అందించారు. వీరి అందరికీ చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు.
వరదల కారణంగా దెబ్బతిన్న బాధితులను ఆదుకునేందుకు దివీస్ సంస్థ ఐదు కోట్ల రూపాయల భారీ విరాళం అందించింది. ఈ మేరకు సంస్థ సీఈఓ దివి కిరణ్ హైదరాబాదులో మంత్రి నారా లోకేశ్‌ను కలిసి చెక్కును అందజేశారు. దివీస్ సంస్థ ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు వరద బాధితులకు ఆహారాన్ని అందజేసేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మరో 4.8 కోట్లను అందజేసింది. మొత్తంగా రాష్ట్రంలో వరద బాధితుల కోసం 9.8 కోట్ల రూపాయల విరాళాన్ని అందించిన సంస్థను మంత్రి లోకేశ్ అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబుకి నెల్లూరుకు చెందిన గంటా రమణయ్య నాయుడు, గంటా రమేష్ 1 కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు. ముఖ్యమంత్రిని హైదరాబాద్‌లోని నివాసంలో కలిసి విరాళంగా చెక్‌ను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారికి కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు.
సీఎం చంద్రబాబు పిలుపునకు అనూహ్య స్పందన- వరద బాధితులకు విరాళాలు వెల్లువ - Huge Donations to CMRF