Donkey Running Competitions in Vajrakarur : సాధారణంగా రథోత్సవం అంటే దేవతా మూర్తులను రథంపై ఊరేగిస్తారు. కానీ అనంతపురం జిల్లా వజ్రకరూర్లలో జరిగే రథోత్సంలో ఓ ప్రత్యేకత ఉంది. అది అందరిలో ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేకెత్తిస్తోంది.
రథోత్సవంలో భాగంగా గాడిదల పరుగు పోటీలు : అనంతపురం జిల్లా వజ్రకరూర్‌లో వెలసిన శ్రీ జనార్ధన వేంకటేశ్వర స్వామి రథోత్సవం ప్రతీ సంవత్సరం వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ రథోత్సవంలో ఓ ప్రత్యేకత ఉంది. గాడిదలకు పరుగు పోటీ నిర్వహిస్తారు. గాడిదలపై వాటి యజమానులు కూర్చొని, వాటిని పరిగెత్తిస్తూ లక్ష్యాన్ని చేరుకోవాలి. ఈ పోటీలో గుర్రాలకు తామేమీ తీసిపోమన్నట్టుగా గాడిదలు పరుగులు తీశాయి. ఈ పరుగు పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివచ్చారు.
దేవతల పెళ్లిలో పిడకల సమరం - ఏళ్లుగా కొనసాగుతున్న వింత ఆచారం - Pidakala Festival
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా నిర్వహణ : ప్రతీ ఏటా జరిగే శ్రీ జనార్ధన వేంకటేశ్వర స్వామి రథోత్సవంలో రజక సంఘం ఆధ్వర్యంలో గాడిదలకు పరుగు పోటీలు నిర్వహిస్తారు. ఈ గాడిద పోటీలు క్రీడామైదానంలో కాకుండా రోడ్డు మీదనే నిర్వహిస్తారని స్థానికులు తెలిపారు. వజ్రకరూరు నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం గాడిదల మీద వెళ్లి తిరిగి వజ్రకరూరుకు వచ్చే విధంగా మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ రన్నింగ్ పోటీ నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు అందజేసి, శాలువా కప్పి సత్కరించారు.
'తలారి చెరువు'లో అగ్గిపాడు ఆచారం- ఆ రోజు ఊరంతా ఖాళీ 'అర్ధరాత్రి దాటాక !'
భారీగా తరలివస్తున్న జనం : ఆద్యంతం ఆసక్తికరంగా, పోటాపోటీగా సాగిన ఈ గాడిదల పరుగు పందెంలో చివరకు మూడు గాడిదలు మాత్రమే మిగిలాయి. ఈ వినోదాన్ని యువకులు బైకులపై ప్రయాణిస్తూ తిలకిస్తూ, వీడియోలు చిత్రీకరించారు. ఈ గాడిద పందేలు ఫేమస్ అవ్వటంతో చుట్టుపక్కల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
Scorpions Festival at Kurnool District: కర్నూలు జిల్లాలో వింత ఆచారం.. కొండరాయుడికి తేళ్లతో పూజలు
ఈ కార్యక్రమం అనంతరం రథం వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు తెల్లవారుజామున స్వామివారి మూల విరాట్‌కు అభిషేకం, అలంకరణ, అర్చనలు, పూజలు చేశారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి క్షేత్రం ఆవరణంలో భాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. సాయంత్రం రథంపై ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి రథాన్ని లాగారు.