Diarrhea Victims Increasing Day by Day in Guntur: గుంటూరు నగరవాసుల గుండెల్లో (Diarrhea victims in Guntur) డయేరియా డేంజర్ బెల్స్ మోగుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా వాంతులు, విరేచనాలతో ప్రజలు ఆసుపత్రుల్లో చేరడం స్థానికుల్ని భయాందోళనలకు గురిచేస్తోంది. అన్ని చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆస్పత్రుల పాలవుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే డయేరియా లక్షణాలతో చనిపోయినవారి సంఖ్య మూడుకు చేరింది. ఇంకా కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
గుంటూరులో ప్రాణాలు తోడేస్తున్న కలుషిత జలం - మొక్కుబడిగా నీటి పరీక్షలు!
గుంటూరులో సరఫరా అవుతున్న కలుషిత తాగునీరు ప్రజల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యుద్ధప్రాతిపదికన అన్ని చర్యలు చేపట్టామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా డయేరియా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికీ కలుషిత నీరే తాగాల్సిన దుస్థితి ఉందని వాపోతున్నారు. రైలు పేట, కొత్తపేట, ఇజ్రాయెల్ పేట, మణిపురం తదితర ప్రాంతాల్లో కుళాయి నీళ్లు రోజువారీ అవసరాలకు వినియోగించేందుకు పనికిరావడంలేదని మండిపడుతున్నారు. చిన్నారులు, పెద్దలు వాంతులు, విరేచనాలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు.
డయేరియాపై మంత్రి విడదల రజిని వ్యాఖ్యలు విడ్డూరం: టీడీపీ నేతలు
గుంటూరు శ్రీనగర్ ఏడో లైనులో నివాసముంటున్న గాజుల సూర్యనారాయణ వాంతులు, విరేచనాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. రైలుపేటకు చెందిన ఇక్బాల్ శుక్రవారం మృతి చెందారు. ఈ నెల 10న పద్మ అనే యువతి మరణించింది. పాడైన పైప్ లైన్లు తాగునీటి సరఫరా వ్యవస్థలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని స్థానికులు వాపోతున్నారు. మరో 200 మందికి పైగా బాధితులు డయేరియా లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వారు చెబుతున్నారు. ఇలా అయితే తాము బతికేదెలా అని ఆవేదన చెందుతున్నారు. కలుషిత నీటి కట్టడికి చర్యలు తీసుకోవాలని మేయర్, కమిషనర్, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవటంలేదని మండిపడుతున్నారు.
గుంటూరులో డయేరియా బాధితలకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతల ఆందోళన!
వాంతులు, విరేచనాలతో మరో వ్యక్తి చనిపోయిన విషయం తెలియగానే పారిశుద్ధ్య సిబ్బంది హడావుడిగా బ్లీచింగ్ చల్లారు. డ్రైనేజీ తొలగించి, మురికి కాలువలు శుభ్రం చేశారు. కలెక్టర్, కమిషనర్ సైతం మృతుడి నివాసం ఉండే శ్రీనగర్ కాలనీ 7 లైన్‌కు వచ్చి పారిశుద్ధ్య పనుల్ని పర్యవేక్షించారు కానీ చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరామర్శించకపోవడంపై స్థానికులు, కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదిరోజులుగా శ్రీనగర్, శారద కాలనీ తదితర ప్రాంతాల్లో వందలాది మంది డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. డయేరియా లక్షణాలతో మెుత్తం ఇప్పటివరకూ నలుగురు మృతి చెందడం పట్ల స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.