Dialysis Patients in Trouble Due To No 108 Services In Anantapur District : ఉమ్మడి అనంతపురం జిల్లాలో డయాలసిస్ రోగుల కష్టాలు ఎంత చెప్పినా తీరవు. నెల రోజులుగా 108 వాహన సేవలు అందకపోవటంతో రోగులను డయాలసిస్‌కు తీసుకెళ్లేందుకు వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వారాని రెండు, మూడుసార్లు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు రవాణా ఖర్చులు భరించలేక అప్పులు చేయాల్సి వస్తోందని రోగుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కిడ్నీ బాధితులకు 108 వాహన సేవలు నిలిచిపోవటంతో వారానికి రెండు, మూడు సార్లు సొంత డబ్బులు వెచ్చించి ప్రాణాలు నిలుపుకుంటున్నారు. జిల్లాల్లో ఆరు చోట్ల ఎన్టీఆర్ (NTR) వైద్య సేవల కింద కిమ్స్ సవేరా, స్నేహలత ఆసుపత్రుల్లో రోగులకు ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తోంది. ఈ కేంద్రాలకు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రోగులు వస్తుంటారు. వ్యాధి తీవ్రత బట్టి వారానికి ఎన్నిసార్లు డయాలసిస్ చేసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. రోగులు తమ గ్రామాల నుంచి డయాలసిస్‌కు వెళ్లేందుకు 108 వాహనాల్లో తరలించేలా గతంలో ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
కోత లేకుండా, నొప్పి తెలియకుండా - కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్
డయాలసిస్ పూర్తయ్యాక రోగులు సొంత ఖర్చుతో తిరిగి ఊరికి వెళ్లేవారు. అయితే వైఎస్సార్సీపీ హయాంలో 108 వాహనాలు నిర్వహించే గుత్తేదారు సంస్థ ఆరబిందో వైద్య ట్రస్టు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం తాత్కాలికంగా ఆ సంస్థను బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో నెల రోజులుగా కిడ్నీ సమస్యలతో ఆసుపత్రికి వెళ్లే రోగులను వాహనాల్లో తరలించడం నిలిపివేశారు.
ఆస్పత్రికి వెళ్లేందుకు ఆటోలు దొరకడం లేదు, బస్సుల్లో వెళ్లాలంటే కష్టమవుతోంది. ఆటో డ్రైవర్లను ప్రాధేయపడి తీసుకెళ్తున్నాం. వెళ్లినప్పుడల్లా చాలా ఖర్చవుతోంది. వచ్చే పింఛన్ సరిపోక అప్పులు చేస్తున్నాం. -డయాలసిస్ బాధితుల బంధువులు
అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో కిడ్నీ బాధితులు వెయ్యి మంది వరకు ఉన్నారు. వీరిలో కొందరికి వారానికి నాలుగు సార్లు డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రోగికి డయాలసిస్ కేంద్రాల్లో సమయం ఇస్తారు. ఆ సమయం ప్రకారం కేంద్రాల వద్ద సిద్ధంగా ఉండాలి. ఒక్కో రోగికి డయాలసిస్ ప్రక్రియ మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నెలరోజుల నుంచి రోగులు 108 సేవలు అందకపోవటంతో ఆస్పత్రులకు వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారు. కిడ్నీ బాధితులను ఆస్పత్రులకు తీసుకెళ్లేందుకు ఆటో వాళ్లు నిరాకరిస్తున్నారు. మరికొందరు ఆటోడ్రైవర్లు వేల రూపాయలు డిమాండ్ చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో రోగుల బంధువులు వారికి అడిగిన మొత్తం చెల్లిస్తున్నారు.
పట్టాలెక్కిన పరిశోధనలు- ఉద్దానం బాధతులకు కూటమితో ఊరట - kidney disease in Uddanam area