Deputy CM Pawan Kalyan Comments on YSRCP : గత ప్రభుత్వ వైఖరి వల్లే విజయవాడ నగరంలో వరద కష్టాలు వచ్చాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విపత్తు నిర్వహణ కమిషన్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఆయన పరిశీలించారు. బుడమేరును పూర్తి చేసుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, చిన్న చిన్న నీటి పాజెక్టులను పూర్తి చేయలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వాన్ని విమర్శించే సమయం కాదని బాధితులను రక్షించాలన్నారు.
వరద ప్రాంతంలో పర్యటించాలనుకున్నా కానీ, నా వల్ల సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలగకూడదని భావించి పర్యటించలేదన్నారు. నా పర్యటన సహాయ పడేలా ఉండాలే తప్ప అదనపు భారం కాకూడదన్నారు. తాను రాలేదని నిందలు వేయాలని అంటారు తప్ప మరొకటి కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవకు ముందుకు రావాలని పవన్ అన్నారు.
గత ప్రభుత్వం తీరువల్లే ప్రజలకు వరద కష్టాలు: ప్రస్తుతం విజయవాడలో వరద తగ్గుతోందని, అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. వరద బాధితులు సహాయం కోసం 112, 1070, 18004250101 ఫోన్ చేయాలని సూచించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు, పాలు అందించామని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రకృతి విపత్తు సమయంలో నిందల కంటే ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని ఆయన అన్నారు.
భవిష్యత్తులో ఇలాంటివి విపత్తులు జరగకుండా ఏం చేయాలనేది మంత్రి వర్గంలో చర్చిస్తామని పవన్ పేర్కొన్నారు. ప్రతి నగరానికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని పవన్ వివరించారు. వరద నిర్వహణ కోసం బృహత్తు ప్రణాళిక తయారు చేస్తామన్నారు. వరద సమయంలో మా శాఖ క్షేత్రస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు.
రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద బాధితులకు భారీ విరాళం ప్రకటించారు. బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి ఈ మేరకు చెక్కు అందజేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణశాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.
వరద బాధితులకు సహాయం చేయాలనుకుంటున్నారా? - బ్యాంక్ ఖాతాల నంబర్లు ఇవే - Donate For Flood Victims