Deputation Officers Returning to Home Cadre : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ కేంద్ర సర్వీసుల నుంచి డిప్యుటేషన్ (Deputation)పై వచ్చిన అధికారుల్లో కొందరు అప్పటి ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులొత్తుతూ, ఆ పార్టీ నాయకులతో అంటకాగుతూ తీవ్రమైన అక్రమాలు, అరాచకాలు, అవినీతికి పాల్పడ్డారు. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయడంలో గత పాలకులకు సహకరించారు. వారు కూడా రూ.కోట్లు వెనకేసుకున్నారు. భారీగా భూములు, బంగారం కొన్నారు. స్థిర, చరాస్తులు కూడగట్టారు. ఒక అధికారి అవినీతి సొమ్ముతో తిరుపతిలో ఏకంగా ఫైవ్‌స్టార్ హోటలే కడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆరేడుగురు అధికారులు సాగించిన అరాచకం అంతా ఇంతా కాదు.
ముగ్గురు అధికారులు రిపోర్టు : వారిలో ఒక్కరు కూడా ఐఏఎస్, ఐపీఎస్‌లు లేకపోయినా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వారి అర్హతలకు మించి కీలకమైన పోస్ట్‌లు కట్టబెట్టింది. దీంతో వారంతా చెలరేగిపోయారు. తాము నిర్వహిస్తున్న శాఖల్ని సొంత సామ్రాజ్యాలుగా భావించారు. వైఎస్సార్సీపీ పెద్దల అండతో కేంద్ర సర్వీసుల నుంచి దిగుమతైన ఆ అధికారులు, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే గుట్టుచప్పుడు కాకుండా వెనక్కి వెళ్లిపోతున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న ముగ్గురు అధికారులు ఇప్పటికే కేంద్ర సర్వీసులకు వెళ్లి రిపోర్ట్ చేశారు. వారిలో ఒకరు వేరే రాష్ట్రంలో కీలకమైన పోస్టింగ్ కూడా తెచ్చుకున్నారు. ప్రభుత్వం రిలీవ్ చేయకపోయినా 'డీమ్డ్ టు బి రిలీవ్డ్' (Deemed To Be Relieved) అన్న క్లాజ్‌ను ఉపయోగించుకుని, వారంతట వారే రిలీవ్ అయిపోయి చక్కగా కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నారు.
వారిని ఏ 'శక్తులు' కాపాడుతున్నాయ్? : అనేక అక్రమాలకు కేంద్ర బిందువులుగా ఉన్న ఆ అరాచక అధికారులపై ఎలాంటి చర్యలూ తీసుకోకుండా కొన్ని 'శక్తులు' అడ్డుపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏ ప్రయోజనాల కోసం వారిని ఆ శక్తులు కాపాడతున్నాయన్న చర్చ జరుగుతోంది. వారు తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నా ఆయా శాఖల్లోని కొందరు సీనియర్ అధికారులు వారిని ఆపేందుకు చర్యలు తీసుకోవడం లేదని సమాచారం. పైగా దిల్లీ వెళ్లేందుకు పరోక్షంగా సహాయం అందిస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి దాదాపు 5 నెలలు అవుతున్నా ఇంత వరకు వెంకటరెడ్డి వంటి ఒకరిద్దరు అధికారులపై తప్ప మిగతా వారి విషయంలో ఎలాంటి చర్యలూ లేకపోవడానికి ఆ 'శక్తులే' కారణమన్న అభిప్రాయం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని ఆదేశాలు జారీ చేస్తే ఒకటి రెండు రోజుల పాటు విచారణ, దర్యాప్తు అంటూ సీనియర్ అధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత ఆ విషయాన్ని మరుగున పడేస్తున్నారు.
అప్పుడు పెద్దలు చెప్పినదానికల్లా తలూపారు - ఇప్పుడేమో చల్లగా జారుకున్నారు
రిజిస్ట్రేషన్ల శాఖలో రామకృష్ణ ప్రవేశ పెట్టిన ఈ-స్టాంపింగ్ (E-Stamping) వ్యవహారంపై విజిలెన్స్ విచారణ తంతు ఇందుకు నిదర్శనం. విచారణకు ఆదేశించి నెల రోజులు దాటుతున్నా ఎలాంటి కదలికా లేదు. ఆయనపై ఎలాంటి అభియోగాలూ నమోదు చేయలేదు. ఇంతలో డిప్యుటేషన్ గడువు ముగియడంతో ఆయన కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు. తప్పు చేసినవారు ఎప్పటికైనా తప్పించుకోలేరని, కేంద్ర సర్వీసుకు వెళ్లినా వారిపై చర్యలు తప్పవన్న భావనతో ప్రభుత్వం ఉండటం సరికాదని, రాష్ట్ర సర్వీసులో ఉన్నప్పుడే వారిపై విచారణ జరిపి, అభియోగాలు నమోదు చేస్తేనే తగిన శిక్ష పడుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో తీవ్ర అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో గనులశాఖ పూర్వ డైరెక్టర్ వెంకట్‌రెడ్డిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండీగా పని చేసిన మధుసూదన్‌రెడ్డిని సస్పెండ్ చేయగా, ఆయన క్యాట్ నుంచి ఉపశమనం పొంది, కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయారు.
శ్రీవారి సన్నిధిలో జగన్ ఆత్మబందువుకే పదవి : ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారులే లేరు అన్నట్లుగా జగన్ మోహన్ రెడ్డి తన ఆత్మబంధువు, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్ (IDEF)కు చెందిన ధర్మారెడ్డిని డిప్యుటేషన్‌పై తీసుకొచ్చి టీటీడీకు సర్వాధికారిని చేశారు. అర్హత లేకపోయినా అందలం ఎక్కించారు. పేరుకి అధికారి అయినా ధర్మారెడ్డి పక్కా వైఎస్సార్సీపీ నాయకుడిలా, జగన్ ప్రయోజనాలు రక్షించడమే పరమావధిగా పని చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
శ్రీవారి దర్శనానికి వచ్చే వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు సర్వోపచారాలు చేయడం ద్వారా వారిని ఆకట్టుకుని, వ్యవస్థల్ని మేనేజ్ చేయడం, జగన్‌పై కేసులు వంటి వ్యవహారాల్లో ఆయనకు రక్షణ కల్పించడం ఆయన ప్రధాన ఎజెండాగా పనిచేశారని చెబుతారు. టీటీడీ అదనపు ఈఓగా ధర్మారెడ్డి శ్రీవారికి చేసిన సేవకంటే జగన్ సేవలో తరించిందే ఎక్కువ. ఆయన హయాంలో టీటీడీలో అనేక అరాచకాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. రూ.వందల కోట్ల శ్రీవారి నిధులను అవసరం లేకపోయినా మౌలిక వసతుల పేరుతో వృథాగా ఖర్చు పెట్టడం, నిక్షేపంగా ఉన్న గోవిందరాజస్వామి సత్రాలను కూలగొట్టి ఆఘమేఘాలపై టెండర్లు ఖరారు చేయడం, కాటేజీల్లో గదుల అద్దెలు విపరీతంగా పెంచడం, శ్రీవాణి ట్రస్ట్ వంటివి తీవ్ర వివాదాస్పదం అయ్యాయి.
వి.రామకృష్ణపై అంతులేని అక్రమాలు : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన IRS అధికారి వి.రామకృష్ణ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీగా ఇష్టానుసారం వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కార్డ్-2.0 సాఫ్ట్‌వేర్ రూపొందించే కాంట్రాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్‌ఐసీని కాదని, క్రిటికల్ రివర్ అనే ప్రైవేటు కంపెనీకి రూ.35 కోట్లకు కట్టబెట్టడం, ఈ-స్టాంపింగ్ పేరుతో తీవ్ర గందరగోళం సృష్టించడం, వైఎస్సార్సీపీ నేతల కోసం ఆఘమేఘాలపై ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు చేయడం వంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అయినా కూడా రాష్ట్ర సర్వీస్ నుంచి రిలీవ్ అయిపోయి కేంద్రానికి వెళ్లిపోయారు.
పరారైన వాసుదేవరెడ్డి : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో APSBCL ఎండీగానూ, డిస్టిలరీ, బ్రూవరీస్ విభాగం కమిషనర్‌గానూ నాలుగున్న సంవత్సరాల పాటు కొనసాగిన వాసుదేవరెడ్డి ప్రభుత్వ పెద్దలు మద్యంలో సాగించిన రూ.వేల కోట్ల దోపిడీకి అన్నీతానై సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటైన మద్యం కంపెనీలు ఉత్పత్తి చేసే 'జే బ్రాండ్లు (J Brand)' మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో లభ్యమయ్యేలా చేసింది ఆయనేనని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించింది.
నాటి ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ముఖ్య నాయకులకు ప్రతి మద్యం కేసుకు రూ. 200-250 చొప్పున, ప్రతి బీరు కేసుకు రూ. 100-150 చొప్పున కమీషన్ చెల్లించిన మద్యం కంపెనీలకే 99% కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడం వాసుదేవరెడ్డి హయాంలో సాగిన దోపిడీ పర్వానికి పరాకాష్ఠ. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదట వాసుదేవరెడ్డి పైనే గురిపెట్టింది. కీలక ఆధారాలు, పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను మాయం చేసేందుకు ఆయన ప్రయత్నించినట్లు సీఐడీ గుర్తించింది. ఆయనపై కేసు నమోదైంది. వాసుదేవరెడ్డి పరారయ్యారు. ఇంత వరకు ఆచూకీ లేదు.
మధుసూదన్‌రెడ్డి ఫైబర్‌నెట్‌ను పీల్చిపిప్పి చేశారు : జగన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై వచ్చిన మరో ఐఆర్‌ఏఎస్ అధికారి మధుసూదన్‌రెడ్డిపై వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఫైబర్‌నెట్ లిమిటెడ్ ( APSFL) ఎండీగా ఆయన ఇష్టానుసారంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ పెద్దల కనుసన్నల్లో పనిచేస్తూ వారు చెప్పినవారికల్లా ఉద్యోగాలు ఇచ్చారని, అడ్డగోలుగా జీతాలు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి.
బిల్లుల చెల్లింపులోను అనేక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాధారణ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఒక బ్యాంకు నుంచి తీసుకున్న రూ.900 కోట్ల నిధుల వినియోగానికి సంబంధించి అవకతవకలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆయనపై కేసు నమోదు చేసింది. ఆయనను సస్పెండ్ చేయడంతో క్యాట్‌కు వెళ్లి సస్పెన్షన్ రద్దుకు ఉత్తర్వులు తెచ్చుకున్న ఆయన, నిక్షేపంగా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోయి ఉద్యోగం చేసుకుంటున్నారు.
జైల్లో వెంకట రెడ్డి : గనులశాఖను వెంకటరెడ్డి శాసించారు. కోస్ట్‌గార్డు సర్వీసుకు చెందిన ఆయనను గత ప్రభుత్వం 2019లో ఏరికోరి డిప్యుటేషన్‌పై తీసుకు వచ్చింది. గనులశాఖ డైరెక్టర్‌గా, కొన్ని రోజులకే ఏపీఎండీసీ ఎండీగా జోడు పదవులను కట్టబెట్టింది. ఐదు సంవత్సరాల పాటు ఆ 2 శాఖల్నీ పీల్చి పిప్పి చేసేశారు. వైఎస్సార్సీపీ నేతలకు అడ్డగోలుగా గనుల లీజులు కేటాయించడం, ఇతర లీజుదారులను బెదిరించి, వాటిని వైఎస్సార్సీపీ నేతలకు బదిలీ చేయించడం, ప్రతిపక్ష నాయకుల గనుల్లో తనిఖీల పేరుతో వేధించి రూ.వందల కోట్ల మేర జరిమానాలు విధించడం వంటి అరాచకాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఐదేళ్ల పాటు రూ.వేల కోట్ల ఇసుక కుంభకోణం వెంకటరెడ్డి అండదండలతోనే జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక గుత్తేదారు సంస్థ జేపీ పవర్ వెంచర్స్ ప్రభుత్వానికి రూ. 800 కోట్లు బకాయి ఉన్నప్పటికీ ఆ సంస్థ బాకీ లేదంటూ ఆయన ఎన్‌ఓసీ జారీ చేశారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఆయనపై కేసు నమోదైంది. అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన వెంకటరెడ్డి సుమారు మూడు నెలలు తప్పించుకు తిరిగారు. ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు.
మరో రాష్ట్రంలో కీలకమైన పోస్టింగ్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా ఆ శాఖ మంత్రికంటే ఎక్కువ హవా నడిపించిన ఐఐఎస్ అధికారి తుమ్మా విజయ కుమార్‌రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం ఏరికోరి డిప్యుటేషన్‌పై తెచ్చుకున్న అధికారుల్లో ఆయన ఒకరు. జగన్ సొంత పత్రిక, ఛానళ్లకు ఇష్టానుసారం రూ.కోట్లలో ప్రకటనలు ఇవ్వడం సహా ఆయన అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఆయనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని అందరూ ఎదురు చూస్తుండగా ఆయన రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ అయిపోయి వెళ్లిపోయారు. మరో రాష్ట్రంలో కీలకమైన పోస్టింగ్ తెచ్చుకున్నారు.
కెవీవీ సత్యనారాయణ : గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖలో అంతా తానే అయి చక్రం తిప్పిన ఐఆర్‌ఏఎస్ అధికారి కెవీవీ సత్యనారాయణ డిప్యుటేషన్ గడువు ముగియడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారడంలో ఈ అధికారిదే ముఖ్య పాత్రన్న ఆరోపణలు ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించి అప్పులు తేవడం, కొత్త కార్పొరేషన్లు పుట్టించి, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టుపెట్టేయడం, కన్సాలిడేటెడ్ ఫండ్‌ను మళ్లించడం వంటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకాలన్నింటిలో సత్యనారాయణ పాత్ర ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికారి ఇప్పుడు చేతులు దులిపేసుకుని, కేంద్ర సర్వీసుకి వెళ్లిపోయి చక్కగా ఉద్యోగం చేసుకోవడానికి సిద్ధం అయ్యారు.
కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తోంది : కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న అఖిల భారత సర్వీసుల అధికారులు కొన్నేళ్ల పాటు వారి సొంత రాష్ట్రంలో పని చేసేందుకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన డిప్యుటేషన్ విధానాన్ని పలువురు అధికారులు దుర్వినియోగం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూడటం విస్తుగొలుపుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొందరు అధికారులు 'డిప్యుటేషన్' అన్న పదాన్ని దోపిడీకి రాజమార్గంగా మార్చుకున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం విశేషం.
ఐదేళ్ల పాటు వారు అన్ని అరాచకాలు చేసినా, రూ.వందల కోట్ల అవినీతికి పాల్పడ్డా కేంద్ర ప్రభుత్వం, నిఘా సంస్థలు, సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు వారిపై కనీసం దృష్టి పెట్టకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. కేంద్ర సర్వీసుల అధికారులు డిప్యుటేషన్‌పై రాష్ట్రాలకు వెళితే ఇక వారితో తమకు సంబంధం లేదన్నట్లుగా కేంద్రం వ్యవహరించడమేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. డిప్యుటేషన్ ముసుగులో కేంద్ర సర్వీసుల అధికారులు రాష్ట్రాలకు వెళ్లి, వారికి అనుకూలంగా ఉన్న అక్కడి ప్రభుత్వ పెద్దల అండదండలతో తీవ్ర అరాచకాలకు పాల్పడుతుంటే కేంద్రం పట్టించుకోకపోవడమేంటి? రాష్ట్రం నుంచి తిరిగి వచ్చిన అధికారులకు వారు అక్కడ ఏం చేశారో తెలుసుకోకుండా, వెంటనే పోస్టింగ్‌లు ఇచ్చేయడమేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.