Dasara Sharan Navaratri Celebrations Starts in Vijayawada Indrakeeladri : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఇవాల్టి నుంచి ఈనెల 12వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ప్రతి రోజు సుమారు లక్ష మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఉచిత దర్శనాలతో పాటు వంద, 3 వందలు , 5 వందల రూపాయల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు. ఆన్‌లైన్‌తో పాటు మొత్తం 14 చోట్ల టిక్కెట్టు విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వినాయక గుడి నుంచి టోల్ గేటు ద్వారా కొండపైన ఓం టర్నింగ్ వరకు 3 క్యూలు ఉంటాయి. అక్కడి నుంచి అదనంగా ఒక ఉచిత దర్శనం వరుసతో పాటు - వీఐపీ వరుస కలిపి మొత్తం 5 వరుసలు అమ్మవారి ఆలయం లోపలి వరకు ఉంటాయి. దర్శన అనంతరం శివాలయం మెట్ల మార్గం గుండా భక్తులు కిందకు దిగుతారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు.
వీవీఐపీలకు తొలి రోజు కాకుండా మిగిలిన అన్ని రోజులు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు దర్శన సమయం నిర్దేశించారు. వృద్ధులు, దివ్యాంగులకు సాయంత్రం 4 నుంచి 5 వరకు పున్నమి ఘాట్ నుంచి వాహనాల్లో అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి దర్శనం చేయిస్తారు. వ్యక్తిగత వాహనాలను కొండపైకి అనుమతించకుండా కేవలం దేవస్థానం వాహనాల్లోనే భక్తులను తీసుకురావాలని భావిస్తున్న యంత్రాంగం - అందుకు తగ్గట్టుగా మినీ బస్సులు, కార్లను కలెక్టరేట్, స్టేట్‌గెస్ట్‌హౌస్, పున్నమిఘాట్, భవానిఘాట్, జమ్మిదొడ్డి వద్ద అందుబాటులో ఉంచింది.
18 చోట్ల ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశారు. కేశఖండన కోసం షిప్టుకు 200 మంది క్షురకులను అందుబాటులో ఉంచారు. నదీ స్నానాలు కాకుండా సీతమ్మ వారి పాదాల వద్ద భారీగా షవర్లు ఏర్పాటు చేశారు. కృష్ణానది పవిత్ర హారతుల దృష్ట్యా దుర్గా ఘాట్ వద్దకు భక్తులను అనుమతించడం లేదు. దేవస్థానం వెబ్‌సైట్‌లో సేవా టిక్కెట్లు, ఇతర ఆర్జిత పూజల టిక్కెట్లు అందుబాటులో ఉంచారు.
దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆచారాల్లో పోలీసుల ఆచారం ఒకటి. ఇంద్రకీలాద్రి ఉన్న పాతబస్తీ అధికారికంగా ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ పోలీస్ స్టేషన్‌కు ఇంద్రకీలాద్రికి ఎప్పటి నుంచో అనుబంధం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు దుర్గమ్మను తమ ఆడపడచుగా...స్టేషన్ ప్రాంతంలో ఉన్న రావిచెట్టు, అక్కడి ప్రాంతాన్ని అమ్మ పుట్టినిల్లుగా భావిస్తారు. రావిచెట్టును అమ్మవారి స్వరూపంగా భావించి. ఆ చెట్టుకు పోలీసులే నిత్యపూజ చేస్తారు. ఇంద్రకీలాద్రిపై జరిగే దసరా ఉత్సవాల్లో ఈ పోలీస్ స్టేషన్ అధికారులు అమ్మకు పుట్టింటివారి పాత్ర పోషిస్తారు.
కొండమీద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యే ముందురోజే పోలీస్ స్టేషన్‌లో ఉత్సవాలు మొదలవుతాయి. ఇక్కడి రావిచెట్టు ప్రాంతాన్ని సర్వాంగసుందరంగా అలంకరించి, అమ్మకు పూజలు చేస్తారు. ఇక్కడ ఉన్న అమ్మవారి మూర్తిని కొండ మీదకు తీసుకువెళ్తారు. తమ ఆడపడచుకు పసుపు కుంకుమలు, పట్టుచీర, సారె తీసుకువస్తారు. వీరు తీసుకొచ్చిన పట్టుచీర అలంకరణ తర్వాతనే కొండపై ఉత్సవాలు మొదలవుతాయి.
ఇంద్రకీలాద్రి పరిసరాలతో పాటు మొత్తం ఆలయంలో భక్తుల రద్దీని సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిశితంగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. 4 వేల 500 మంది పోలీసులను బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు.