Damaged Roads in Krishna District: రోడ్డుపై దట్టంగా పొగ, ఆపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని పరిస్థితి. ఇదంతా చూసి శీతాకాలం కదా మంచు కురుస్తుందిలే అనుకుంటే పొరపాటే. రోడ్ల నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వ నిలువెత్తు నిర్లక్ష్యానికి ప్రతిరూపమే ఈ రహదారి. రోడ్డుపై ఎక్కడికక్కడ కంకర తేలిపోవడంతో వాహనాలు వచ్చిపోయే సమయంలో దట్టంగా దుమ్ము కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వైసీపీ నేత కొడాలి నాని ఈ ప్రాంతం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గత ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. తమకు అధికారం కట్టబెట్టిన ప్రజల కనీస అవసరాలను తీర్చడంలో మాత్రం నాయకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిడుమోలు నుంచి కౌతవరం వెళ్లే 10 కిలోమీటర్ల ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. యలకుర్రు, డోకిపర్రు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఏ చిన్న అవసరానికైనా నిడుమోలు లేదా ఇటు గుడ్లవల్లేరు వెళ్తుంటారు.
అడుగుకో గుంతతో ప్రజల పాట్లు - అధ్వానంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు
ప్రస్తుతం ఈ రహదారిపై ప్రయాణమంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. రాళ్లు పైకి తేలి, దుమ్ము, ధూళి కమ్మేయడంతో రోడ్డు కనపడక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. రాత్రిళ్లు ఈ రోడ్డుపై ప్రయాణం నరకాన్ని చూపిస్తోంది. అధికారులు మరమ్మతులు చేయకపోవడంతో రోడ్డంతా పూర్తిగా పాడయ్యింది. వర్షం పడితే రోడ్డు మీద వాహనదారులు, ప్రయాణికులు కాలుమోపలేని స్థితిలో ఉంటుందని వాహనదారులు వాపోతున్నారు.
నిడుమోలు నుంచి కౌతవరం వెళ్లే రోడ్డుకు అనుబంధంగా ఉన్న గ్రామాల ప్రజలు నిడుమోలు మీదుగా విజయవాడ, మచిలీపట్నం లేదా డోకిపర్రు, గుడ్లవల్లేరు మీదుగా గుడివాడకు రాకపోకలు సాగిస్తుంటారు. అటువంటి ప్రధాన రహదారికి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులు, రైతులు, వాహనాదారులు నానా అగచాట్లు పడుతున్నారు. రహదారి అధ్వానంగా మారడంతో వాహనాలు నిత్యం రిపేర్లు వస్తున్నాయని, సంపాదించిందంతా మరమ్మతులకే ఖర్చు అవుతోందని వాపోతున్నారు.
7 కిలోమీటర్లు 700 గుంతలు - వణుకూరు అంటే వణుకుతున్న వాహనదారులు
నిడుమోలు- కౌతవరం రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా స్థానిక నేతలు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడుతున్నారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న నివాసదారులు దుమ్ముధూళితో నరకం అనుభవిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితం మంచిగా ఉన్న రోడ్డును పగులగొట్టారని అప్పటి నుంచి తమకు సమస్యలు మొదలయ్యాయని స్థానికులు వాపోతున్నారు. దుమ్ము వల్ల ఇంట్లో నుంచి బయటక రావాలంటే భయంగా ఉందని చెప్పారు.
రహదారిపై రాళ్లు తేలడంతో భారీ వాహనాలు ప్రయాణించిన సమయంలో రాళ్లు ఎగిరిపడటంతోపాటు దట్టంగా దుమ్ము కమ్మేస్తోంది. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదని వాహనాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలు వెళ్లినప్పుడు ఆ వేగానికి రోడ్డుపై ఉన్న రాళ్లు మీద పడుతున్నాయని, దీని వల్ల చాలా మంది గాయాలపాలయ్యారని వాపోయారు.
హడావుడి చేశారు, అర్ధాంతరంగా ఆపేశారు - నిత్యం నరకం చూస్తున్నామంటున్న రైతులు