Caste Discrimination in Siddipet : దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్న కులవివక్ష పోవడం లేదు. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడోచోట అనునిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. కులవివక్ష నిర్మూలనపై కఠిన చట్టాలు అమలు చేస్తున్న కులజాఢ్యం అంతం కావడం లేదు. తక్కువ కులానికి చెందినవారంటూ ఆలయాలలోనూ, సమూహంగా జరిపే పండుగలలోనూ పాల్గొనకుండా అడ్డుకుంటున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
అనుమతి నిరాకరణ : తాజాగా ఇటువంటి ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వెళ్లగా, ఇతర కులస్తులు నిరాకరించి అడ్డుకున్నారు. వివరాల్లోకెళ్తే సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని శివారు వెంకటాపూర్‌లో నూతనంగా దుర్గమ్మ ఆలయాన్ని నిర్మించారు. గ్రామంలో జరుగుతున్న దుర్గమాత ఉత్సవాల్లో భాగంగా బోనాలు చేయడానికి దళితులు ఆలయానికి వెళ్లారు.
కేసు నమోదు : అక్కడున్న కొందరు వ్యక్తులు దళితులు బోనాలు చేయకూడదని, దుర్గమాత ఆలయంలోకి ప్రవేశం లేదని అడ్డుకున్నారు. దీంతో తమకు ఆలయం ప్రవేశాన్ని నిరాకరించారని, దళితులమంటూ వివక్ష చూపారని సదరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కులవివక్ష చూపిన కొందరిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఇలాంటి ఘటనలు మన సమాజంలో జరగడం దురదృష్టకరమని, ఈ కేసును ఏసీబీ ఆధ్వర్యంలో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసు సిబ్బందితో కలిసి గ్రామాన్ని సందర్శించి, గ్రామ పెద్దలకు, ఇరువర్గాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. గ్రామంలో దళిత కుటుంబాలు యథావిధిగా బోనాల పండుగ జరుపుకునే విధంగా ఏర్పాటు చేస్తామని ఊరి పెద్దలు హామీ ఇచ్చారు.
"మర్కుక్ మండలంలోని శివారు వెంకటాపూర్‌లో నూతనంగా దుర్గమ్మ ఆలయాన్నినిర్మించారు. గ్రామంలో జరుగుతున్న దుర్గమాత ఉత్సవాల్లో భాగంగా బోనాలు చేయడానికి దళితులు ఆలయానికి వెళ్లారు. అక్కడున్న కొందరు వ్యక్తులు దళితులు బోనాలు చేయకూడదని, దుర్గమాత ఆలయంలోకి ప్రవేశం లేదని అడ్డుకున్నారు. దళితులమంటూ వివక్ష చూపారని ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కులవివక్ష చూపిన కొందరిపై కేసు నమోదు చేశాము. గ్రామ పెద్దలకు, ఇరువర్గాలకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చాము.". - మహేందర్ రెడ్డి, రూరల్ సీఐ
సిద్దిపేటలో దారుణం - ఆడిస్తానని తీసుకెళ్లి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం - Three Year old Girl Raped