Cyclone Fengal Update: పుదుచ్చేరి సమీపంలో ఫెయింజల్ తుపాను తీరం దాటింది. తీరం దాటినా కూడా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద భూభాగం మీదే కొనసాగుతోంది. ఇది పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ రానున్న 6 గంటలలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఆదివారం, సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.
రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు కాకినాడ, కోనసీమ జిల్లాలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్లు వేగంతో గాలులు వీస్తున్నాయి. పోర్టులకు ఇచ్చిన ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకున్నారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా సూళ్లూరు పేటలో 17 సెంటీమీటర్లు, అమలాపురంలో 6 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది.
తీరం దాటిన ఫెయింజల్ తుపాన్ - ముందుకొచ్చిన సముద్రం - మరో రెండ్రోజులు భారీ వర్షాలు
తుపాను తాకిడికి నిండా మునిగిన పుదుచ్చేరి: ఫెయింజల్ తుపాను తమిళనాడు రాష్ట్రంలోని పుదుచ్చేరి కరేకల్ మధ్య శనివారం రాత్రి తీరం దాటడంతో, పుదుచ్చేరిలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షాలకు లోతట్టి ప్రాంతాలతో పాటు ప్రధాన పట్టణంలోనూ వరద నీరు ప్రవహిస్తోంది. తుపాను ప్రభావంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ (National Disaster Response Force) బృందాలు రంగంలోకి దిగాయి.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వరద: తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురిశాయి. కేవీబీ పురం మండలంలోని కాలింగ్ రిజర్వాయర్, రేణిగుంట మండలంలోని మల్లెమడుగు రిజర్వాయర్‌కు భారీగా వరద నీరు చేరడంతో గేట్లు ఎత్తి నీరు బయట ప్రాంతాలకు వదిలారు. స్వర్ణముఖి నదికి భారీగా వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లోని కాజ్ వేలపై నీరు ప్రవహించడంతో రాకపోకలను అధికారులు నియంత్రించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రమాదాలను తెలియజేస్తూ సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు.
అల్లకల్లోలంగా సముద్రతీరం: ఫెయింజల్ తుపాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రం 20 మీటర్ల పైగా ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తుపాన్ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కార్తిక మాసం కావడంతో మొక్కులు తీర్చుకునే భక్తులు సముద్ర స్నానాలకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. ఒడ్డునే స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశామని మెరైన్ పోలీసులు తెలిపారు.
పుదుచ్చేరి-మహాబలిపురం దగ్గర తీరాన్ని తాకిన తుపాను - ఆ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక