Cyber Fraud in Hyderabad : నగరంలో సైబర్ నేరాలు (Cyber Crime) రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్ట్ టైం జాబ్స్, ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట వాట్సాప్, టెలిగ్రామ్ లింక్‌లు పంపుతూ కొత్త కొత్త పద్దతులతో సైబర్ నేరగాళ్లు అమాయకులకు వల విసురుతున్నారు. అధిక డబ్బు ఆశ జూపి, అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, అపరిచితుల మాటలను నమ్మి పెద్దఎత్తున డబ్బు పోగొట్టుకున్నారు. అనంతరం బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.
మ్యాట్రిమోనిలో పరిచయమైన మహిళకు రూ.2.71 కోట్ల టోకరా - Man arrest for cheat in Matrimony
యాక్సిస్ క్రెడిట్ కార్డు పేరిట రుణ పరిధిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతామంటూ ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి చెప్పడంతో బాధితుడు నమ్మి, బ్యాంకు ఖాతా వివరాలతో పాటు, వ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాడికి చెప్పాడు. అనంతరం వచ్చిన ఓటీపీ చెప్పమని సైబర్ నేరగాడు కోరడంతో బాధితుడు ఓటీపీని సైబర్ కేటుగాడికి తెలిపాడు. దాంతో అతని ఖాతా నుంచి దాదాపుగా రూ.2 లక్షల 90 వేల 253 నష్టపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
Online Trading Fraud in Hyderabad : మరో కేసులో ఇంకో బాధితుడు గూగుల్ మ్యాప్స్‌లో రేటింగ్ ఇవ్వాలనే పార్ట్ టైం ఉద్యోగం (Parttime Job) పేరిట మోసానికి గురయ్యాడు. ముందు రేటింగ్ ఇస్తున్న క్రమంలో డబ్బులు పెట్టుబడి పెడితే, 20 నిమిషాల్లో అద్భుతమైన లాభాలు వస్తాయని నమ్మించారు. తర్వాత బాధితుడుని కొన్ని గ్రూప్‌లలో యాడ్ చేశారు. క్రమంగా రూ.2 వేల నుంచి రూ.90 వేలు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారు. భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత తాము చెప్పిన విధంగా ట్రేడింగ్ చేయడం లేదని, నష్టాలు వస్తే తాము బాధ్యత వహించలేమని నేరగాళ్లు ప్లేటు ఫిరాయించారు.
దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో, అతణ్ని అన్ని గ్రూప్‌ల నుంచి రిమూవ్ చేశారు. ఈ క్రమంలోనే బాధితుడు దాదాపుగా రూ.2 లక్షల 91 వేల 930 మోసపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అపరిచితుల నుంచి వచ్చే లింక్‌లను నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అధిక డబ్బు ఇస్తామంటూ, బ్యాంకు వివరాలు అప్డేట్ చేయాలంటూ వివరాలు అడిగితే, వారికి స్పందించవద్దని సూచిస్తున్నారు. మోసపోయినట్లు గుర్తిస్తే సైబర్ నేరం జరిగిన వెంటనే cybercrime.gov.inలో రిపోర్ట్ చేయాలని, లేదంటే 1930 టోల్‌ఫ్రీకి కాల్ చేయాలని పేర్కొంటున్నారు.
పెట్టుబడుల పేరిట 70 ఏళ్ల వృద్ధుడి నుంచి 22 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు