Cyber Crime in Nizamabad : కొత్త పంథాలతో సైబర్ నేరాలకు తెరలేపారు నేరగాళ్లు. ఈ నేరాల పట్ల అవగాహన పెరిగినందున రోజుకో మార్గంలో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల పేరిట వాట్సాప్ క్రియేట్ చేసి, ప్రజలకు కాల్స్ చేసి ఫలనా మీ అబ్బాయి, అమ్మాయి ఫలానా కేసులో ఇరుక్కుందంటూ చెప్పి డబ్బులు లాగుతున్నారు. పోలీస్ అధికారుల ఫొటోతో కాల్ రావడంతో ఆందోళనకు గురువుతున్న కొంతమంది డబ్బులు పంపిస్తున్నారు. మరికొందరు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఒకతనికి ఎదురైంది. దీంతో నిందితులకు ప్రశ్నల వర్షం కురిపించగా ఏకంగా కాల్ కట్ చేశారు.
హైదరాబాద్‌లో ట్రేడింగ్ పేరిట మోసానికి మరొకరు బలి
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూర్ గ్రామానికి చెందిన వ్యాపారి శంకర్‌కు ఇద్దరు కుమారులు. ఇద్దరు విదేశాల్లో ఉంటున్నారు. సోమవారం ఉదయం శంకర్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. 'మీ కుమారుడు, మరో ఇద్దరు యువకులు మాదకద్రవ్యాలు తరలిస్తూ పోలీసులకు చిక్కారు. రూ.2.5లక్షలు ఇస్తే వారిని విడిచి పెడతాం, లేదంటే జైలుకు పంపిస్తాం' అని హిందీలో మాట్లాడి బెదిరించారు.
అప్రమత్తమైన బాధితుడు : మీరు ఎవరని అడగ్గా నిజామాబాద్ సీపీ అని బదులు ఇచ్చారు. త్వరగా డబ్బులు పంపాలని పదేపదే అడగడంతో శంకర్‌కు అనుమానం వచ్చింది. దీంతో 'అప్రమత్తమైన తాను వారితో వాదించాడు. అయినా మా సీపీ తెలుగులో మాట్లాడుతారు, హిందీలో మాట్లాడరు, మీ భాష చూస్తుంటే వేరే రాష్ట్రానికి చెందిన వారిలా మాట్లాడుతున్నారు, సరే డబ్బులు తీసుకుని వస్తాం ఎక్కడికి రావాలని అడగ్గా' కాల్ కట్ చేశారు. శంకర్ అప్రమత్తం కావడంతో సైబర్ నేరం నుంచి తప్పించుకోగలిగాడు. ఎవరైనా డబ్బుల కోసం ఈ తరహా ఫోన్స్ వస్తే ప్రజలు భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు.
"నాకు ఫోన్ వచ్చింది. మీ అబ్బాయి డ్రగ్స్ కేసులో చిక్కాడు, కేసు కావొద్దంటే డబ్బులు ఇవ్వాలి అని అడిగారు. అయితే నాకు అనుమానం వచ్చింది. మీరు ఎవరు అని అడిగితే నిజామాబాద్ సీపీ అన్నారు. అయితే నేను సీపీ అయితే డైరెక్ట్ ఫోన్ చేయరు, స్టేషన్‌కు తీసుకువెళ్తారు లేదా పోలీసులను ఇక్కడికి పంపిస్తారు అని నేను అన్నాను. తర్వాత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీ భాష తేడాగా ఉంది మా సీపీ హిందీలో మాట్లాడరు అని నేను అనగానే కాల్ కట్ చేశారు." - శంకర్, భాదితుడు
రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar
'పోలీసులు మీకు ఫోన్ చేయరు - కాల్ చేస్తోంది మేం కాదు కేటుగాళ్లు' - సైబర్ నేరాలపై డీజీపీ